చెల్లని రూపాయికి గీతలెక్కువ: బండి సంజయ్
చెల్లని రూపాయికి గీతలెక్కువ.. కేసీఆర్ నోటికి కోతలెక్కువ..అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర రథ సారథి...Bandi Sajay serous on kcr
దిశ, జగిత్యాల ప్రతినిధి: చెల్లని రూపాయికి గీతలెక్కువ.. కేసీఆర్ నోటికి కోతలెక్కువ..అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర రథ సారథి, ఎంపీ సంజయ్ కుమార్ సీఎం కేసీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ మెట్ పల్లిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటనతో తెలంగాణకు పట్టిన శని నేటితో విరగడయిందన్నారు. ఇక్కడే ఏం చేయలేని వ్యక్తి దేశ రాజకీయాలలో ఏం చేస్తాడని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని దోచుకుతినే గుంట నక్కలంతా ఒకటయ్యారని, దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసే తుక్డే గ్యాంగ్ అంతా కలిసిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టి రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పిన తర్వాత బీఆర్ఎస్ ముచ్చట చెప్పాలని, రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కరించాక దేశ సమస్యలు గురించి మాట్లాడాలని హితవు పలికారు. ఇక అన్ని స్కాంలు చేసిన కేసీఆర్, కవిత చేయని దందాలు లేవని, వారిని జైలుకు పంపడం ఖాయమన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడని, తెలంగాణ ప్రజల బతుకును బిచ్చపు బతుకుగా చేశారాని అన్నారు.
రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి కేసిఆర్ అని, పుట్టబోయే బిడ్డ పేరుపై లక్ష రూపాయల అప్పు పెట్టిండని పేర్కొన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఎన్ని హామీలు నెరవేర్చారని ప్రశ్నించారు. దేశాన్ని దోచుకునేందుకే జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని, పంజాబ్ పోయి అక్కడ రైతులకు మూడు లక్షల ఆర్థిక సహాయం చేసి వచ్చారని, పంజాబ్ లో కేసీఆర్ రైతులకు ఇచ్చిన చెక్కులు చెల్లని పరిస్థితి ఉందని ఆరోపించారు. మెట్ పల్లి సుందరీకరణ కోసం 50 కోట్ల రూపాయల నిధులను ఇస్తే ఎక్కడైనా సుందరీకరణ కనిపిస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే... నేడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా అని అన్నారు. గతంలో ఏరోజు పార్లమెంటుకు కేసీఆర్ పోలేదని, విజయశాంతి పార్లమెంటుకు వెళ్లి, జై తెలంగాణ అని యుద్ధం చేసిందని, అసలైన, నిజమైన ఉద్యమకారులంతా ఇవాళ బీజేపీలోనే ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటిలో కేంద్రం భాగస్వామ్యం ఉందని తెలిపారు.