యాదాద్రి తరహాలో రాజన్న ఆలయ అభివృద్ధికి చర్యలు : మంత్రి కొండా సురేఖ

యాదాద్రి తరహాలో వేములవాడ రాజన్న ఆలయాన్ని ఆధ్యాత్మికంగా

Update: 2024-10-14 12:36 GMT

దిశ,వేములవాడ : యాదాద్రి తరహాలో వేములవాడ రాజన్న ఆలయాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తన మనవడి పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమంలో భాగంగా సోమవారం రాజన్న ఆలయానికి కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన మంత్రి స్వామివారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పుట్టువెంట్రుకల కార్యక్రమం నిర్వహించారు.తదనంతరం శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ రాజన్న దేవాలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, త్వరలోనే రాజన్న దేవాలయ అభివృద్ధి పై సీఎం స్థాయిలో అత్యున్నత సమావేశం జరుగుతుందని, శాస్త్రాల ప్రకారం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని రకాల వసతులను కల్పిస్తూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సైతం ఆలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని కొనియాడారు.

యాదాద్రి తరహాలో వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, యాదాద్రి ఆలయానికి 63 కేజీల బంగారంతో తాపడం ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. వేములవాడ దేవాలయం వద్ద 65 కేజీల బంగారం 5 వేల కిలోల వెండి అందుబాటులో ఉందని వీటిని వినియోగించుకొని వేములవాడ ఆలయానికి సైతం బంగారు తాపడం, వెండితో పల్లకీలు, ఉత్సవ విగ్రహాలు రూపొందించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అంతకుముందు దర్శనంలో భాగంగా ఆలయానికి చేరుకున్న మంత్రికి ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజన్ పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలకగా, పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి వెంట ఆలయ ఈ.ఓ. వినోద్ రెడ్డి, వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, జడ్పీటీసీ నాగం కుమార్, ఆర్డీఓ, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.

ఆరోపణలపై మంత్రి 'నో కామెంట్'

ఇదిలా ఉండగా వేములవాడ పర్యటనకు వచ్చిన మంత్రిని ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు,మీపై వస్తున్న ఆరోపణలపై స్పందన ఏంటి అని మీడియా ప్రతినిధులు అడుగగా ఇది దేవాలయం, ఇక్కడ రాజకీయ అంశాలకు సంబంధించిన విషయాలు మాట్లాడలేను ''నో కామెంట్'' అనుకుంటూ వెళ్ళిపోయారు.


Similar News