‘హరిత’ కథ ఖతమేనా?
ఇథనాల్ ఫ్యాక్టరీతో హరిత హోటల్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందా? అంటే అవుననే అనిపిస్తుంది.
దిశ, వెల్గటూర్: ఇథనాల్ ఫ్యాక్టరీతో హరిత హోటల్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందా? అంటే అవుననే అనిపిస్తుంది. పర్యాటకులకు ఆహ్లాదంతో పాటు వారి ఆకలిని తీర్చుదామనుకున్న లక్ష్యానికి ఆదిలోనే అడ్డంకులు వచ్చి పడ్డాయి. వెల్గటూర్ మండలం స్తంభం పల్లి శివారులోని సర్వే నెంబర్ 1090 లో పర్యాటక శాఖ రూ.4.6 కోట్లు వెచ్చించి సర్వాంగ సుందరంగా నిర్మిస్తోంది. తుది మెరుగులు దిద్దుకుని త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటిలింగాలను చూసేందుకు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు.
దీనికి తోడు గోదావరి తీరంలో పార్వతీ కోటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కొలువై ఉండడంతో కోటిలింగాల రాష్ట్రంలోనే ప్రముఖ చారిత్రక ప్రదేశంగా, పుణ్యక్షేత్రం గా పేరొందింది. ఈ నేపథ్యంలోనే కోటిలింగాలలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఫలితంగా కోటిలింగాల పర్యాటక ప్రాంతంగా దినదినం అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా హోటల్ నిర్మాణం చేపట్టింది.
2022, జూన్ 3న భూమిపూజ..
హరిత హోటల్ కు 2022-జూన్ 3న మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమి పూజ చేశారు. అనంతరం కాంట్రాక్టర్ హోటల్ నిర్మాణాన్ని ప్రారంభించి వేగంగా పనులు చేస్తున్నారు. మంజూరైన నిధులతో ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తి కాగా ఎన్నికల నేపథ్యంలో ప్రారంభించేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
పక్కనే ఫ్యాక్టరీ..
ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే సమస్య మొదలైంది. ఇథనాల్ ఫ్యాక్టరీని కూడా దీని పక్కనే నిర్మించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధం అయింది. ఇదే గనుక జరిగితే ఫ్యాక్టరీ కాలుష్యంతో హరిత హోటల్ మూతపడటం ఖాయమని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. సర్వేనెంబర్ 10 90 లోనే హరిత హోటల్‌ను ఆనుకొని ఫ్యాక్టరీని నిర్మించడానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ అప్పటి కలెక్టర్ రవి 2022 నవంబర్ 18న స్థల పరిశీలన చేసి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి 100 ఎకరాల భూమిని ఇటు ప్రభుత్వానికి అటు కంపెనీ వారికి నోటిఫై చేసి అందజేశారు.
చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకుండానే అధికారులు ప్రజా ప్రతినిధులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరికి వారే ఒకే చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పైసా ఖర్చు లేకుండా వచ్చే 100 ఎకరాల భూమి, మూడు దిక్కుల నీటి వసతి, పచ్చని పంట పొలాలు అన్ని విధాలా ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుకూలంగా ఉండటంతో క్రిబ్ కో కంపెనీ వారు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఒకే చెప్పారు.
మట్టి టెండర్ ప్రక్రియ పూర్తి..
కంపెనీకి అందించిన భూమిలో ఉన్న పుట్ట బోర్లను చదును చేయడానికి రూ. 13 కోట్లు ప్రభుత్వ నిధులను సైతం ఇటీవల కేటీఆర్ మంజూరు చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించడం విశేషం. అంతేకాకుండా ఇక్కడ మట్టి తీయడానికి టెండర్ ప్రాసెస్ కూడా పూర్తయినట్లు తెలిసింది. ఇక ప్రభుత్వం అధికారికంగా ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూమి పూజ చేయడమే మిగిలి ఉంది.
రెండింటికీ ఆరు నెలల తేడా...
హరిత హోటల్ భూమి పూజ నిర్మాణానికి ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం స్థల పరిశీలనకు మధ్య గడచిన కాలం తేడా ఆరు నెలలు మాత్రమే ఉంది. దాదాపుగా ఈ రెండు ప్రాజెక్టుల ప్రారంభానికి పరిశీలనకు వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు సేమ్ టు సేమ్ అని గమనించాలి. ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి స్థల పరిశీలన చేసే నాటికి హరిత హోటల్ నిర్మాణం గ్రౌండ్ స్థాయిలోనే పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.10 నుంచి 20 లక్షల వరకు పనులు జరిగి ఉంటాయి. పెద్ద ఎత్తున కాలుష్యాన్ని విడుదల చేసే ఇథనాల్ పరిశ్రమ నిర్మించే ప్రదేశంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హరిత హోటల్ నిర్మించడం సరైంది కాదని ఒక్కరు కూడా ఆలోచించక పోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సరైన సమయంలో అధికారులు ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకుని ఉంటే హోటల్ నిర్మాణ పనులు గ్రౌండ్ లెవెల్‌లోనే ఆగేవి. ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయితే నిత్యం రణగొణ ధ్వనులతో ఈ ప్రాంతమంతా రద్దీగా ఉంటూ కాలుష్యంతో నిండుతుందని దీంతో హరిత హోటల్‌కు పర్యాటకులు రావడం కష్టమేనని పలువురు అంటున్నారు. హరిత హోటల్ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణానికి మంజూరైన నిధులు మొత్తం ఖర్చయి పోయినట్లు కాంట్రాక్టర్ తెలిపారు. దీనిని పూర్తి షేపులో నిర్మించాలంటే మరో రెండు నుంచి మూడు కోట్ల రూపాయల అవసరం ఉంటుంది. మరిన్ని నిధులను నిర్మాణానికి వెచ్చించి వృధా చేయొద్దని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
హరిత హోటల్ మూత పడుతుంది...
ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే హరిత హోటల్ మూతపడటం ఖాయం. ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుర్వాసన, కాలుష్యం వల్ల పర్యాటకులు హోటల్ కు వచ్చే పరిస్థితి ఉండదు. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి కూడా ఆగుతుంది. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాల వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. పరిసరాల్లోని గ్రామాల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది:-మేరుగు మురళి గౌడ్, సర్పంచ్, వెల్గటూర్