Kaloji Varsity: కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ పోస్ట్ భర్తీ ఎన్నడు..? ఫైనల్ చేయని సెర్చ్ కమిటీ

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ రిక్రూట్‌మెంట్‌లో జాప్యం కొనసాగుతోంది.

Update: 2024-07-30 02:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ రిక్రూట్‌మెంట్‌లో జాప్యం కొనసాగుతోంది. వీసీ ఎంపిక కోసం గతంలో ప్రభుత్వం సెర్చ్ కమిటీ వేసింది. కానీ ఇప్పటి వరకు పేర్లను ఫైనల్ చేయకపోవడం గమనార్హం. ఆగస్టు 14 నుంచి యూజీ కోర్సుల కౌన్సెలింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులను కూడా విడుదల చేయనున్నట్టు మెడికల్ కౌన్సిల్ కమిటీ ప్రకటించింది. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ పూర్తి కాగానే మన దగ్గర ఎంబీబీఎస్ అడ్మిషన్లకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను కాళోజీ హెల్త్ వర్సిటీ ఆధ్వర్యంలో జరగాల్సి ఉన్నది. కానీ ఇప్పటికీ వీసీ నియామకం జరగకపోవడంతో అడ్మిషన్ల ప్రాసెస్‌కు ఆటంకం కలిగే ప్రమాదం ఉన్నదని సీనియర్ డాక్టర్లు చెప్తున్నారు. మరో వైపు జూన్ 5 నుంచి జూలై 6 వరకు వీసీ పోస్టుకు దరఖాస్తులు స్వీకరించారు.

దాదాపు 80‌కు పైగా అప్లికేషన్లు వచ్చినట్టు తెలిసింది. వీటిని పరిశీలించి సెర్చ్ కమిటీ స్క్రూట్నీ చేసి మూడు పేర్లను ప్రభుత్వానికి పంపాలి. సీఎం పరిశీలించిన అనంతరం గవర్నర్ ఒక పేరును ఫైనల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికీ కనీసం దరఖాస్తుల ఫిల్టర్ ప్రాసెస్ కూడా పూర్తి కాలేదని సమాచారం. దీనిపై విద్యార్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ల పాటు వీసీగా పనిచేసిన కరుణాకర్‌రెడ్డి, కాళోజీ హెల్త్ వర్సిటీగా ఏర్పడినప్పటి నుంచి ఆ సీటులోనే ఉన్నారు. వైద్యారోగ్యశాఖలోని హెచ్‌వోడీల్లో అత్యధిక కాలం లాంగ్ స్టాండింగ్ అధికారిగా ఆయనకు గుర్తింపు ఉన్నది. గత ప్రభుత్వానికి అతి సన్నిహితంగా ఉన్నందునే ఆయనను ఏండ్ల తరబడి వీసీగా కొనసాగించారని డిపార్ట్‌మెంటు‌లో చర్చ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల తర్వాత వీసీ పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 5న హెల్త్ సెక్రెటరీ నోటిఫికేషన్ జారీ చేసి, అదే నెల 22 వరకు గడువిచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్‌లో డీన్ పోస్టులో రెండేండ్ల పాటు పనిచేసి ఉండాలని సూచించారు. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధం. దీంతో ఆ నోటిఫికేషన్‌ను సవరించి, జూలై 6 వరకు అప్లయ్‌కు అవకాశం ఇచ్చారు.

Tags:    

Similar News