దూకుడు పెంచిన కాళేశ్వరం కమిషన్.. వారం రోజుల్లో పెద్దోళ్లకు నోటీసులు?

కాళేశ్వరం‌ ప్రాజెక్టుపై ఎంక్వయిరీ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ దూకుడు పెంచింది.

Update: 2024-08-18 02:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం‌ ప్రాజెక్టుపై ఎంక్వయిరీ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ దూకుడు పెంచింది. ఆ ప్రాజెక్టులో భాగంగా నిర్మితమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సహా ఆ ప్రాజెక్టు పరిధిలో ఉన్న పలు అంశాలపై జరుపుతున్న విచారణ వేగవంతం చేసింది. ఇప్పటి వరకూ అధికారుల నుంచి టెక్నికల్ విషయాలపై అఫిడవిట్‌లను స్వీకరించి అధ్యయనం చేసిన కమిషన్.. అందులోని వివరాల ఆధారంగా కొందరు పెద్దలకు నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది. ప్లానింగ్, డిజైనింగ్, కన్‌స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్, మెయింటెనెన్స్.. ఇలా అనేక విషయాలపై ఇప్పటికే లోతుగా స్టడీ చేసింది. పాలసీ అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్న పలువురి నుంచి సైతం వివరణ తీసుకోవాలని అనుకుంటున్నది.

ఇందులో భాగంగా కొందరు పెద్దలకు నోటీసులు జారీ చేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్టు కమిషన్ వర్గాల ద్వారా తెలిసింది. వారం రోజుల వ్యవధిలోనే నోటీసులు జారీ అయ్యే అవకాశమున్నదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు దాదాపు యాభైకి పైగా అఫిడవిట్లను అందుకున్న కమిషన్.. అందులోని వివరాల మేరకు కొందరు నాన్ అఫీషియల్స్‌కు నోటీసులు ఇచ్చి వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు అవసరమైతే అఫిడవిట్ల ద్వారా వివరణ తీసుకోవాలని భావిస్తోంది. ఓ మాజీ చీఫ్ సెక్రెటరీ స్థాయి అధికారి దాదాపు మూడు వారాల క్రితం కమిషన్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నింటినీ ఏకరువు పెట్టినా ఆ ఆఫీసర్ నిర్దిష్ట గడువులోగా అఫిడవిట్‌ను సమర్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కమిషన్ సమన్లు జారీ చేయాలనుకుంటున్నది.

క్రాస్ ఎగ్జామినేషన్!

అఫిడవిట్లలో ప్రస్తుత అధికారులు, రిటైర్ అయిన ఆఫీసర్ల అభిప్రాయాలు, వివరాలకు అనుగుణంగా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్‌ను సైతం త్వరలోనే ప్రారంభించాలని కమిషన్ భావిస్తున్నది. అవసరమైతే ఆ ప్రక్రియలో నాన్ అఫీషియల్స్‌ను సైతం భాగస్వాములను చేసే చాన్స్ ఉన్నట్టు కమిషన్ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు టెక్నికల్ అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి ముందే ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ), పూణె టెక్నికల్ నిపుణుల బృందం, రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ నుంచి వచ్చే ఫైనల్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నది. ఇప్పటికే అవి ఇచ్చిన ప్రాథమిక రిపోర్టులను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. తుది నివేదికల్లో చేసే సిఫార్సులపై స్టడీ చేయాలనుకుంటున్నది. గతంలోనే ఈ మూడు సంస్థలకు లేఖలు రాసినా అవి తుది నివేదికలను ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై కమిషన్ అసహనంతో ఉన్నట్టు సమాచారం.

గతంలో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించాలన్న ఆలోచన ఉన్నప్పటికీ అక్కడి నుంచి మేడిగడ్డకు మార్చాలనే ప్రతిపాదనలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఇంజినీర్లతో ఫైవ్ మెన్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీలోని ఒకరు అనారోగ్య కారణాల రీత్యా ఇంకా అఫిడవిట్ సమర్పించలేదని తెలిసింది. టెక్నికల్ అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్‌కు ముందే నాన్ అఫీషియల్స్ అభిప్రాయాన్ని కమిషన్ స్వీకరించాలనుకుంటున్నది. వారికి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆశించిన తీరులో సహకారం అందనట్లయితే ఎలాంటి వైఖరి తీసుకోవాలన్నదానిపైనా కమిషన్ లోతుగా ఆలోచిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన టాస్కులో భాగంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పరిధికి లోబడి ఆర్థిక అంశాలపైనా నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టింది. మూడు బ్యారేజీలలో సబ్ కాంట్రాక్టు వ్యవస్థ ఉన్నట్టు ఇప్పటికే గుర్తించింది. మెయిన్ నిర్మాణ సంస్థకు ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు, అక్కడి నుంచి సబ్ కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి చేరుకున్న గణాంకాలను సైతం సేకరిస్తుంది. దీనికి కొనసాగింపుగా పాలసీ నిర్ణయాలు తీసుకున్నదెవరనే కోణం నుంచి ఎంక్వయిరీని ముమ్మరం చేయనున్నది.

రాష్ట్ర భవిష్యత్తు కోసమే రీ-డిజైనింగ్ : వీ ప్రకాశ్

గత ప్రభుత్వంలో జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేసిన వీ ప్రకాశ్ స్వచ్ఛందంగా కమిషన్ ముందు శనివారం హాజరయ్యారు. రెండు గంటల పాటు ప్రాజెక్టుల రీ-డిజైన్ ఆవశ్యకతను వివరించినట్టు మీడియాకు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే అనేక ప్రాజెక్టులను రీ-డిజైన్ చేయాల్సి వచ్చిందన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు కేంద్ర జల సంఘం చెప్పినా అందులో 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా అని కమిషన్‌ను చెప్పినట్టు వెల్లడించారు. మిగిలిన 102 టీఎంసీలతోనే రాష్ట్ర సాగునీటి అవసరాలను తీర్చుకోలేమన్న సంగతిని సైతం వివరించామన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ ఉద్దేశపూర్వకంగానే కమిషన్‌ను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చే ఆలోచన చుట్టూ కమిషన్ ఆలోచిస్తూ ఉన్నదన్నారు. దాని నుంచి బయటకువచ్చి రాష్ట్ర భవిష్యత్తు, విస్తృత సాగునీటి అవసరాల కోణం నుంచి పరిశీలించాలని సూచించారు.

వార్ధా, వెన్ గంగ నదులు కలిసే చోట ‘వి’ షేప్‌లో బ్యారేజీ కట్టడం సురక్షితం కాదన్న కారణంగానే తుమ్మిడిహట్టి దగ్గర నిర్మణం చేపట్టలేదని చెప్పుకొచ్చారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రం నుంచీ అన్యాయం జరిగిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే రీ-డిజైన్ చేయాల్సి వచ్చిందంటూ పన్నెండు పేజీల నోట్‌ను కమిషన్‌కు అందజేసినట్టు తెలిపారు. నోటిమాటగా చెప్పిన వివరాలన్నింటినీ అఫిడవిట్ రూపంలో ఈ నెల 26వ తేదీకల్లా సమర్పించాల్సిందిగా జస్టిస్ ఘోష్ డెడ్‌లైన్ విధించినట్టు మీడియాకు వివరించారు. అదే రోజున మరోసారి కమిషన్ ముందు హాజరవుతానని తెలిపారు.


Similar News