‘డొంక తిరుగుడు మాటలొద్దు’ హరీశ్ రావు రాజీనామా లేఖపై కడియం శ్రీహరి ఘాటు రియాక్షన్

రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్ రావు తన మాటకు కట్టుబడి ఉండాలని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

Update: 2024-04-27 10:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్ రావు తన మాటకు కట్టుబడి ఉండాలని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తొలుత రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్ రావు ఇప్పుడు రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలకు ముడిపెడుతున్నాడని ఆ తర్వాత ఆరు గ్యారెంటీలతో పాటు మరికొన్ని హామీలు లింక్ చేస్తారని ఎద్దేవా చేశారు. రాజీనామాపై డొంక తిరుగుడు మాటలు మాట్లాడవద్దని రాజీనామా విషయంలో హరీశ్ రావు రాజీనామా పత్రం ఇవ్వడం ఓ డ్రామా అన్నారు. ఆయన పక్కా డ్రామా మాస్టర్ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ కు కట్టుబడి ఉన్నారన్నారు. శనివారం హన్మకొండలో వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి మీడియాతో మాట్లాడిన శ్రీహరి బీఆర్ఎస్ ఓ ప్రాంతీయ పార్టీ అని విమర్శించారు.

కేసీఆర్ అధికారులను బలి చేశారు:

కేసిఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని గత ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం బ్యారేజ్ లో పిల్లర్లు కుంగిపోవడానికి కేసీఆరే బాధ్యత వహించాలని, ఫోన్ ట్యాపింగ్ కామన్ అన్న కేసీఆర్ అధికారులను బలి చేశారని ధ్వజమెత్తారు. ఈ కేసులో తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఇరికించారని ఆరోపించారు. కేసీఆర్ ప్రమేయం లేకుండానే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేని బీజేపీ.. మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని తహతహలాడుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళ సూత్రానికి భద్రత ఉండదనే విధంగా ప్రధాని మోదీ నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ రిజర్వేషన్లు పరోక్షంగా ఎత్తివేసే కుట్ర చేస్తోందని దీని వల్ల దేశం ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందన్నారు. బీజేపీ కుట్రల పట్ల భారత దేశ ప్రజలు మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తమవ్వాలని పిలుపునిచ్చారు.

మందకృష్ణ నా ఇంటికి వచ్చి దండం పెడతాడు:

నా బిడ్డ కడియం కావ్య ఎంపీగా గెలిచిన తర్వాత ఇదే మంద కృష్ణ నా ఇంటికివచ్చి దండం పెడతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా వద్ద వందల కోట్లు ఉన్నది నిజమే అయితే నాపై ఐటీ, ఈడీ సోదాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది. మే 13న కాంగ్రెస్ ఓటు వేసి బీజేపీ కి బుద్ది చెప్పాలన్నారు. తెలంగాణకు బీజేపీ వ్యతిరేకం కాబట్టే విభజన హామీలను అమలు చేయడం లేదని తెలంగాణలో బీజేపీకి ఓటు అడిగే నైతిక అర్హత, హక్కు లేదన్నారు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉండి తెలంగాణకు ఒరగబెట్టింది ఏమి లేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి ఒక స్పష్టమైన ప్రణాళికను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 7 నియోజకవర్గల అభివృద్ధి ప్రణాళికను మీ ముందు పెట్టబోతుందని చెప్పారు.

Tags:    

Similar News