నా పిల్ అడ్డుకుంటున్నారు: కేఏ పాల్ సంచలన ఆరోపణలు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులిస్తున్నాడు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులిస్తున్నాడు.సెక్రటేరియట్ ప్రారంభోత్సవంపై ఇదివరకే హైకోర్టులో పిటిషన్ వేసిన కేఏ పాల్ తాజాగా కొత్త సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. సెక్రటేరియట్లో జరిగిన అగ్నిప్రమాదంపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న కేఏ పాల్.. తాను దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని మంగళవారం మరోసారి చీఫ్ జస్టిస్‌ను కోరినట్లు కేఏ పాల్ తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సెక్రటేరియట్‌ను క్రైమ్ జోన్‌గా గుర్తించాలని, నూతన సెక్రటేరియట్‌ను సీజ్ చేసి విచారణ జరపాలని కోరానన్నారు. జరిగిన సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక అక్కడ నరబలి ఏమైనా జరిగిందా? అనేది విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కేఏ పాల్ దాఖలు చేసిన పిల్కి నెంబరింగ్ ఇవ్వాలని రిజిస్టార్‌కి చీఫ్ జస్టిస్ ఆదేశించించినట్లు పాల్ తెలిపారు. కాగా సెక్రటేరియట్ ప్రారంభోత్సవం కేసీఆర్ పుట్టిన రోజు కాకుండా అంబేద్కర్ పుట్టిన రోజు ప్రారంభోత్సవం చేయాలని మరో పిల్ వేసిన నేపథ్యంలో ఈ రెండు వ్యాజ్యాలు గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.