NV Ramana: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు జస్టిస్ ఎన్వీ రమణ భారీ సాయం

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.

Update: 2024-09-04 07:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వరదల్లో పలు గ్రామాలు కాలనీలు నీటి మునిగి జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదల్లో ఆవాసం కోల్పోయిన వారికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద భాదితులకు తమ వంతు సాయం చేసేందుకు రాజకీయ సినీ ప్రముఖులతో పాటు ఇతర రంగాల వారు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా మందుకు వచ్చారు. ఏపీ, తెలంగాణలకు చెరో 10 లక్షలు చొప్పున మొత్తం 20 లక్షలు విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కులను ఢిల్లీలోని రెండు తెలుగు రాష్ట్రాల రెసిడెంట్ కమీషనర్లకు అందజేశారు.

ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ఈ విపత్కర సమయంలో ప్రతి ఒక్కరు తమకు చేతనైనంత సాయం చేయాలని, సమాజం కోసం అందరూ ముందుకు వచ్చి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల పట్ల ఉదారత చూపి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా బంగాళఖాతంలో అల్పపీడం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను వానలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు ఉప్పొంగాయి. తద్వారా వచ్చిన వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ వరదల్లో చాలా మంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు విరాళాలు ప్రకటిస్తున్నారు. 


Similar News