మాకు రక్షణ కల్పించండి : మహిళా కమిషన్ ను కోరిన జూనియర్ డాక్టర్లు

కోల్‌కతా ఘటన నేపథ్యంలో తెలంగాణలోనూ ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్‌ కాలేజీలు, హాస్టళ్లలో, మహిళా డాక్టర్లు, మెడికోలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జూనియర్‌ డాక్టర్ల సంఘం (జూడా) నాయకులు కోరారు.

Update: 2024-08-18 15:58 GMT

దిశ తెలంగాణ బ్యూరో : కోల్‌కతా ఘటన నేపథ్యంలో తెలంగాణలోనూ ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్‌ కాలేజీలు, హాస్టళ్లలో, మహిళా డాక్టర్లు, మెడికోలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జూనియర్‌ డాక్టర్ల సంఘం (జూడా) నాయకులు కోరారు. ఈ మేరకు ఆదివారం టీ-జూడా ప్రతినిధి డాక్టర్‌ చంద్రిక నేతృత్వంలో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ తదితర కాలేజీ మహిళా ప్రతినిధులతో కలిసి తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఎన్.శారదను కలిసి మెమొరాండం అందజేశారు. రెసిడెంట్ డాక్టర్లు, మెడికోలు ఎదుర్కొంటున్న సమస్యలపై విన్నవించారు. ఈ విషయంలో ఛైర్‌పర్సన్‌ సానుకూలంగా స్పందించి, తెలంగాణ ప్రభుత్వానికి ఇదే విషయాన్ని తెలియజేసి అన్ని సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారని జూడా నేతలు వెల్లడించారు.

మహిళలకు మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యంతో కూడిన ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని కోరారు. రాత్రి వేళల్లో మహిళా, పురుష పోలీసు కానిస్టేబుళ్లు విధిగా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. క్యాంపస్‌ అంతటా సీసీటీవీతో నిరంతర పర్యవేక్షణ ఉండాలనీ, అలారం ఫీచర్‌తో కూడిన ప్రత్యేక మొబైల్ యాప్‌ని అభివృద్ధి చేయాలని కోరారు. రాత్రి పూట పని చేసే మహిళలందరికీ తప్పనిసరి చేయాలన్నారు. ఈ యాప్ స్థానిక పోలీస్ స్టేషన్లు , కంట్రోల్ రూమ్‌లకు కనెక్ట్ చేయాలన్నారు. అన్ని మెడికల్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో బ్రీత్ ఎనలైజర్ పరీక్షలతో సహా భద్రతా తనిఖీలు చేయాలన్నారు. ప్రైవేట్‌ సెక్యూరిటీ వ్యవస్థ వద్దని, ఇదంతా సీఆర్‌పీఎఫ్‌ లేదా సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలోనే నిర్వహించాలన్నారు. దీనివల్ల ఎక్కడ ఏం జరిగినా వైద్య ఆరోగ్యమంత్రి లేదా ఆరోగ్య కార్యదర్శి బాధ్యత వహిస్తూ స్పష్టమైన జవాబుదారీతనం ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి వేధింపులకైనా పరిష్కరించేందుకు కమిటీలను ఏర్పాటు చేసేలా అన్ని కాలేజీలు, ఆసుపత్రులను ఆదేశించాలన్నారు. ఆసుపత్రుల్లోకి ప్రవేశించే రోగుల సహాయకులందరినీ పరీక్షించడానికి యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌ను అమలు చేయాలన్నారు. జూడా సభ్యుల భాగస్వామ్యంతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. పరిస్థితులను అంచనా వేయడానికి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లు ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. రాత్రి వేళల్లో ఒకరి కదలికల గురించి మరొకరు అవగాహనతో, మహిళలు జంటలుగా లేదా బృందాలుగా పని చేసేలా షెడ్యూల్‌ తయారు చేయాలన్నారు. సెక్యూరిటీ ఆడిట్ రెగ్యులర్ గా జరగాలని కోరారు.  


Similar News