JP Nadda సభతో బీఆర్ఎస్‌కు షాక్ తప్పదా?
రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ తెలంగాణలో మరింత స్పీడ్ పెంచింది.
దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ తెలంగాణలో మరింత స్పీడ్ పెంచింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర ఐదవ విడత రేపటితో ముగియనుంది. ఈ సందర్భంగా కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. అయితే బీఆర్ఎస్ ఆవిర్భావంత తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వంలోని కీలక నేత ఒకరు రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ సభపైనే అందరి దృష్టి పడింది. నడ్డా పర్యటనతో రాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది.
బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయబోతున్న నడ్డా?
రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఈ రెండు పార్టీ నడుమ నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. పరస్పర ఆరోపణలో రాజకీయం చలికాలంలోనూ సెగలు కక్కుతోంది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో బీజేపీని నిలువరిస్తానంటూ కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో రేపు జేపీ నడ్డా తన ప్రసంగం ద్వారా కేసీఆర్ ను టార్గెట్ చేస్తారనే ప్రచారం వినిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంతో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం వంటి అంశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గతంలో తెలంగాణకు వచ్చిన నడ్డా కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్ ను ఇంటికి సాగనంపడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని బంధీ చేశారని ఆరోపించారు. గతంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన జేపీ నడ్డా.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్, ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీలపై ఏ విధంగా ఎటాక్ చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది.
రేపటి సభలో బీఆర్ఎస్‌కు షాక్ తప్పదా?
రాష్ట్రంలో ఇటీవల వలసల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆపార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తన బాటలోనే మరి కొంత మంది ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నారని మర్రి చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి. అలాగే టీఆర్ఎస్ లోనూ ఇటీవల కొంత మంది నేతల తీరు సందేహంగా మారింది. ముఖ్యంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ జెండా లేకుండానే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం చర్చకు దారి తీసింది. సందర్భం వచ్చినప్పుడు తమ పార్టీలో చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నడ్డా మీటింగ్ లో చేరికలు ఉంటాయా అనేది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన నేపథ్యంలో అధికార పార్టీకి మరో ప్రత్యర్థి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేలా చేరికల విషయంలో రాష్ట్ర బీజేపీ నేతల వద్ద ఎదైనా ప్రణాళిక ఉందా అనేది ఆసక్తి రేపుతోంది.