పేట్‌ బషీరాబాద్‌ భూములను వెంటనే అప్పగించాలి.. జేఎన్‌జే సొసైటీ డిమాండ్

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి నిజాంపేట్‌, పేట్‌ బషీరాబాద్‌ లోని 70 ఎకరాలు జేఎన్‌జే సొసైటీకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించాలని జేఎన్‌జే కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

Update: 2023-07-02 16:39 GMT

దిశ , తెలంగాణ బ్యూరో : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి నిజాంపేట్‌, పేట్‌ బషీరాబాద్‌ లోని 70 ఎకరాలు జేఎన్‌జే సొసైటీకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించాలని జేఎన్‌జే కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫౌండర్‌ మెంబర్‌ పీవీ రమణారావు అధ్యక్షతన జవహర్‌ లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ సభ్యుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ‍ప్రకారం జేఎన్‌జే సొసైటీ సభ్యులకు మాత్రమే ఈ స్థలాలు చెందుతాయని, ఈ స్థలాలు జేఎన్‌జే సొసైటీకి అప్పగించాల్సిందేనని స్పష్టం చేసారు. ఇందులో మధ్యవర్తిత్వం అవసరమే లేదని స్పష్టంగా పేర్కొందని అన్నారు . ప్రభుత్వం నిర్ణయించిన అప్పటి మార్కెట్‌ ధర ప్రకారంగా రూ.12.33 కోట్లు చెల్లించి సొసైటీ సభ్యులు కొనుగోలు చేసినందున భూమిని స్వాధీనం చేసుకునే హక్కు కలిగించిందని అయన వివరించారు. కోర్టు తీర్పును అమలు చేయని పక్షంలో.. ఈ అంశంపై సుప్రీంకోర్టు తలుపు తట్ట వచ్చని ఆయన సూచించారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థలాలను జేఎన్‌జే హౌసింగ్‌ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించని పక్షంలో సొసైటీ సభ్యులకు కోర్టుల్లో న్యాయ సాయంతోపాటు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని సుప్రీంకోర్టు అడ్వకేట్‌ రామచంద్ర రావు తెలిపారు . సభ్యులు రూ.2 లక్షల చొప్పున రూ.12.33 కోట్లు ప్రభుత్వానికి చెల్లించినందున 70 ఎకరాల స్థలం జర్నలిస్టులకే చెందుతుందని అన్నారు. జేఎన్‌జే సొసైటీ వ్యవస్థాపక సభ్యుడు పీ వీ రమణారావు మాట్లాడుతూ.. స్థలాల సాధనకు న్యాయ పరమైన చర్యలు తీసుకుంటున్నామని, కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేస్తామని తెలిపారు. అలాగే నిరసనలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, రిలే నిరాహార దీక్షల ద్వారా ఆందోళన ఉదృతం చేస్తామన్నారు . ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమావేశాలు, రిలే నిరాహర దీక్షలు చేపట్టాలన్న తీర్మానాలకు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న 500 మంది సభ్యులందరు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

Tags:    

Similar News