BREAKING: తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర నూతన డీజీపీగా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ను

Update: 2024-07-10 11:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర నూతన డీజీపీగా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ను నియమించింది. ప్రస్తుత డీజీపీ రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నూతన డీజీపీగా నియామకమైన జితేందర్ ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

కాగా, ఇటీవల రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. నగరంలో రోజుకో మర్డర్.. వారానికో అత్యాచారం జరుగుతోందని.. రాజధానిలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వంపైన ప్రతిపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం డీజీపీని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. 

కాగా, పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌కు చెందిన జితేందర్ 1992 కేడర్ ఐపీఎస్ ఆఫీసర్. తొలుత ఏపీ కేడర్‌లో పని చేసిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ‌కు అలాట్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మల్, బెల్లంపల్లి ఏఎస్పీగా పనిచేసిన జితేందర్.. మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగానూ పని చేశారు. అనంతరం డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసులోకి వెళ్లిన ఆయన సీబీఐ, గ్రేహౌండ్స్‌లో వివిధ హోదాల్లో వర్క్ చేశారు. అనంతరం డీఐజీగా ప్రమోషన్ పొంది విశాఖపట్నం రేంజ్, వరంగల్ డీఐజీగా పనిచేశారు. తర్వాత సీఐడీ, విజిలెన్స్‌లో వర్క్ చేయడంతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణలో లా అండ్‌ ఆర్డర్ అదనపు డీజీగా, జైళ్ల శాఖ డీజీగా పనిచేసిన జితేందర్.. ప్రస్తుతం డీజీపీ హోదాలో హోం శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా ఆయనను డీజీపీగా నియమించింది.


Similar News