'అందరినీ బేషరతుగా విడుదల చేయాలి'

Update: 2023-08-25 16:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యం కోసం వెళ్ళిన కూర రాజన్నను, అతనికి అనారోగ్య పరిస్థితి తెలుసుకోవడం కోసం వెళ్ళిన అమర్ లను, పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెంటనే విడుదల చేయాలని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు విమలక్క, కొమురన్న, సంతోష్ డిమాండ్ చేశారు. గురువారం రాత్రి మీడియా ప్రకటన విడుదల చేశారు. జనశక్తి నాయకుడు కూర రాజన్న ఏప్రిల్ నెలలో జైలు నుండి విడుదలై కేసుల మీద కోర్టుకు హాజరవుతూనే ఉన్నారని తెలిపారు. కూర రాజన్నకు 12 రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆయన అనారోగ్య సమస్యల గూర్చి వైద్యులు రాజన్నకు సోదరుడైన అమర్ కు తెలిపారన్నారు.

రాజన్నకు అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో, రాజన్నకు వైద్య సహాయకుడిగా ఉన్న వెంకటేష్ ద్వారా అమర్ కు తెలియడంతో రాజన్నను కలవడానికి వెళ్ళాడని, ఈ సమయంలోనే అరెస్టు చేశారు అన్నారు. రాజన్నకు వైద్య సహాయకుడిగా ఉన్న వెంకటేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, ఎక్కడి పోలీసులో ఇప్పటికీ తెలియడం లేదని, కూర రాజన్న, అమర్ లతో పాటు అక్రమంగా అరెస్టు చేసిన వాళ్లందరినీ తక్షణమే విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే కూర రాజన్నకు వైద్యం అందెలాగ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని డిమాండ్ చేశారు.


Similar News