రాష్ట్ర కేబినెట్ విస్తరణపై ‘మహా’ ఎఫెక్ట్

మహారాష్ట్ర ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో.. దీపావళిలోపే విస్తరణ చేపడుతారా..? లేక మహారాష్ట్ర ఎన్నికల తర్వాత చేస్తారా..? అనే చర్చ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నది.

Update: 2024-10-17 03:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కేబినెట్ విస్తరణపై డైలమా నెలకొన్నది. ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో.. దీపావళిలోపే విస్తరణ చేపడుతారా..? లేక మహారాష్ట్ర ఎన్నికల తర్వాత చేస్తారా..? అనే చర్చ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నది. తొలుత శ్రావణ మాసంలో చేపడతారని వార్తలు వచ్చాయి. కానీ.. అప్పటి నుంచి పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుండడంతో వారిలో ఆందోళన తొలగలేదు. తాజాగా దీపావళిలోపు విస్తరణకు ముహూర్తం ఖరారైందని వార్తలు రావడంతో అంతా సంతోషపడ్డారు. కానీ.. ఈ లోపే మహారాష్ట్ర ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో మంత్రివర్గ విస్తరణకు బ్రేకులు పడతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీపావళి లోపా? తర్వాతా?

దీపావళిలోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? లేకపోతే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత చేపడతారా? అనే ఉత్కంఠ ఆశావహుల్లో కనిపిస్తున్నది. ముందుగా అనుకున్న షెడ్యూలు ప్రకారం సీఎం రేవంత్ ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లి, 17న రాహుల్‌తో భేటీ అవుతారని ప్రచారం జరిగింది. ఈ సారి పర్యటనలో కేబినెట్ విస్తరణపై రాహుల్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ.. సీడబ్యూసీ మీటింగ్ వాయిదా పడటంతో రేవంత్ ఢిల్లీ టూర్ రద్దయింది. దీంతో రాహుల్ అపాయింట్‌మెంట్ కోసం సీఎం ఎదురుచూస్తున్నట్టు సమాచారం. ఒకవేళ రాహుల్ టైం ఇస్తే కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందని.. లేదంటే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల (నవంబరు 23) తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తున్నది.

మహారాష్ర్ట ఎన్నికల్లో ఏఐసీసీ బిజీ

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు తలకిందులు కావడంతో.. మహారాష్ట్ర ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఆ రాష్ట్రంలో గెలిస్తే దేశవ్యాప్తంగా పార్టీకి మంచి ఊపు వస్తుందని అంచనా వేస్తున్నది. దీంతో అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపైనే రాహుల్‌గాంధీ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారని కాంగ్రెస్ అధిష్టానానికి సన్నిహితంగా ఉండే పీసీసీ నేతలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు రాష్ట్ర నేతలకు రాహుల్ టైమ్ ఇవ్వకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆయన సమయం ఇస్తే కేబినెట్ విస్తరణకు క్లియరెన్స్ వస్తుందని భావిస్తున్నారు.

వరుసగా అడ్డంకులే..

ప్రస్తుతం సీఎం రేవంత్ మంత్రివర్గంలో ఆయనతో కలుపుకుని 12 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నది. సామాజిక సమీకరణలు, ఆశావహుల మధ్య ఉన్న పోటీ వల్ల కొంతకాలం విస్తరణ వాయిదా వేసినట్టు ప్రచారం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న వారిని బుజ్జగించిన తరువాత లైన్ క్లియర్ అయిందని టాక్. సరిగ్గా అదే టైంలో శ్రావణ మాసం ఉండటంతో విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అవుతుందని ఆశావాహులు భావించారు. కానీ.. ఈలోపే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడం, ఆయన తిరిగి రాగానే హర్యానా ఎన్నికల్లో బిజీ కావడం జరిగిపోయాయి. కాంగ్రెస్ ఊహించినట్టుగా హర్యానాలో ఫలితాలు రాకపోవడంతో రిజల్ట్స్‌పై ఏఐసీసీ పోస్ట్ మార్టం నిర్వహించే పనిలో బిజీగా ఉన్నది. ఈ లోపే మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ రావడంతో కేబినెట్ విస్తరణకు మళ్లీ అడ్డంకులు వస్తాయని అశావహుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Similar News