నత్తనడకన ‘గ్రేటర్’ కేడర్.. సీరియస్ మోడ్‌లో టీపీసీసీ!

గ్రేటర్ హైదరాబాద్ పార్టీ టీమ్‌పై పీసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పవర్‌లోకి వచ్చిన తర్వాత కూడా ఆశించిన స్థాయిలో పార్టీ ప్రోగ్రామ్‌లు చేయడం లేదని అసహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం.

Update: 2024-10-17 02:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పార్టీ టీమ్‌పై పీసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పవర్‌లోకి వచ్చిన తర్వాత కూడా ఆశించిన స్థాయిలో పార్టీ ప్రోగ్రామ్‌లు చేయడం లేదని అసహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ముఖ్యనేతల సమావేశంలో టీపీసీసీ సీరియస్ అయినట్టు తెలిసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ డీసీసీలు, గతంతో పోల్చితే పార్టీ యాక్టివిటీస్‌లో సరైన స్థాయిలో భాగస్వామ్యం కావడం లేదని పీసీసీ చీఫ్​, ఏఐసీసీ ఇన్‌చార్జి, కార్యదర్శులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో డీసీసీ అధ్యక్షులు అగ్రనాయకులు చుట్టు మాత్రమే తిరుగుతున్నట్టు పీసీసీ వివరించింది.

దీని వల్ల పార్టీ ప్రోగ్రామ్‌లు, కార్యకర్తల మానిటరింగ్, సమస్యల పరిష్కారం, నేతల మధ్య సమన్వయం వంటి విషయాలను లైట్ తీసుకుంటున్నట్టు పీసీసీ వెల్లడించింది. కేవలం అధిష్టానం మెప్పు కోసం పనిచేస్తేనే సరిపోదని, క్షేత్రస్థాయిలోని పబ్లిక్‌తో మమేకమై, కార్యకర్తల సమస్యలను పట్టించుకున్నప్పుడే లీడర్ అవుతారని పీసీసీ చురకలు అంటించినట్టు తెలిసింది. స్టేట్ హెడ్ క్వార్టర్‌లో ఉంటూ పార్టీ కార్యక్రమాలను ఆశించిన స్థాయిలో ఇంప్లిమెంట్ చేయకపోతే ఎట్లా? అంటూ పీసీసీ చీఫ్ ​ప్రశ్నించారు. పబ్లిక్‌ను మొబిలైజ్ చేయడంలోనూ ఇక్కడ చిక్కులే ఉన్నాయంటూ అసంతృప్తిని వెలిబుచ్చారు. మరోవైపు కొందరు క్షేత్రస్థాయి నేతలు ఖైరతాబాద్ డీసీసీపై పార్టీకి ఫిర్యాదులు అందించినట్టు సమాచారం. అగ్రనేతలు వచ్చినప్పుడే హడావిడి చేస్తున్నారని, ఆ తర్వాత కార్యకర్తలు, ముఖ్య లీడర్లను పట్టించుకోవడం లేదని కంప్లయింట్ ఇచ్చినట్టు తెలిసింది.

వంద సీట్లు గెలవాల్సిందే...?

గ్రేటర్‌లో పార్టీ నిర్లక్ష్యంపై ప్రశ్నించిన పీసీసీ చీఫ్, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లు గెలవాల్సిందేనంటూ టార్గెట్ ఇచ్చారు. ఎలా గెలుస్తాం? ప్రజల్లో ఏ మేరకు కన్విన్స్ చేయాలి? ప్రభుత్వ పాలనను ఎలా వివరించాలి? క్షేత్రస్థాయి లీడర్లకు ఎలాంటి భరోసా ఇవ్వాలి? అనే అంశాలపై త్వరలో మరో మీటింగ్ పెట్టి వివరిస్తామని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డీసీసీలకు పీసీసీ చీఫ్ ​వివరించినట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ మరింత పట్టు పొందేందుకు జీహెచ్‌ఎంసీ, ‘స్థానిక’ ఎన్నికలే ముఖ్యమని, వీటిలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ గెలవాల్సిందేనని పీసీసీ చీఫ్ ​స్పష్టం చేశారు. విభేదాలు పక్కనపెట్టి సమన్వయంతో పనిచేయాలని నేతలకు పీసీసీ చీఫ్​ సూచించారు.

పదవులపై భరోసా..?

పార్టీ కోసం పనిచేసినోళ్లకు పదవులు గ్యారంటీ అనే నినాదంతో ముందుకెళ్తామని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. త్వరలో స్వయంగా తానే జిల్లాల టూర్‌లో పాల్గొంటానని పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. సీఎం‌తో చర్చించిన తర్వాత షెడ్యూల్‌ను ఫిక్స్ చేస్తామని ప్రకటించారు. పదేండ్ల పాటు చాలా మంది కార్యకర్తలు, నేతలు పార్టీ కోసం కష్టపడ్డారని, అలాంటి వారి వివరాలన్నీ గాంధీభవన్‌లో ఉన్నాయని పార్టీ లీడర్లకు చెప్పారు. ఎవరూ అధైర్యపడొద్దని, పనిచేసినోళ్లకు పదవి ఇప్పించే బాధ్యత తనదేనని మహేశ్ గౌడ్ భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయి లీడర్లను గెలిపించుకున్నప్పుడే, ప్రభుత్వానికి, పార్టీకి గౌరవం ఉంటుందని పీసీసీ చీఫ్ నొక్కిచెప్పారు.


Similar News