చేనేత కార్మికుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలే: జక్కని సంజయ్ కుమార్

పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని జక్కని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

Update: 2024-06-17 09:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సరైన పని లేక, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో నేత కార్మికులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. అప్పుల బాధతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలానికి చెందిన చేనేత కార్మికుడు బొల్లబత్తిని వెంకటేశం కుటుంబాన్ని సంజయ్ కుమార్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటేశం కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకునేందుకు ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ వ్యవస్థతో సిరిసిల్ల, కొత్తపల్లి, గద్వాల, వరంగల్ పట్టణాల్లోని వస్త్ర ఉత్పత్తి కేంద్రాలు కుదేలైపోయాయని, పనులు లేక కార్మికులు ఇతర పనులు చేసుకోలేక అప్పల పాలవుతున్నారని అందువల్ల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పద్మశాలిలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.

ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో పద్మశాలీల కోసం ప్రత్యేక పథకాలను తీసుకొస్తామని, ప్రతి కార్మికుడికి ఒక జత మరముగ్గాలు ఉచితంగా అందిస్తామని, యంత్రాలను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా పంపిణీ చేసి 365 రోజులు పని కల్పించి నేత రంగానికి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో ఉపాధి మార్గం లేక ఇప్పటి వరకు 22 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. ఇకనైనా సర్కార్ కళ్ళు తెరిచి నిరుపేద నేత కార్మికులను ఆదుకోవాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలు అంతా పోరాటాలకు దిగుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిట్కూరి శ్రీనివాస్, పేంటీ రాజమౌళి, రుద్ర పరం, పేంటీ శ్రీకాంత్, నరాల రాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News