CM రేవంత్‌ను ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నాదే.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్(BRS) నేతలకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) సవాల్ విసిరారు. రుణమాఫీపై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు.

Update: 2024-10-05 11:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేతలకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) సవాల్ విసిరారు. రుణమాఫీపై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ఒప్పించి చర్చకు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా.. కేసీఆర్‌ను ఒప్పించి చర్చకు తీసుకొచ్చే దమ్ము హరీష్ రావు(Harish Rao)కు ఉందా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అక్కడ, ఇక్కడ భయం అయితే.. నేరుగా సిద్దిపేటలోనే చర్చ పెడదామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణామాఫీ కాలేదు. ఆ విషయం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది.

వివరాలు తెప్పించాలని అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశారని జగ్గారెడ్డి గుర్తుచేశారు. అసలు ఈ పరిస్థితి రావడానికి కేసీఆర్, హరీష్ రావు తప్పులే కారణమని మండిపడ్డారు. పదే పదే రుణమాఫీ చేయలేదని హరీష్ రావు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ ఇంటి ఎదుట ధర్నా చేస్తామంటున్నారు. ఈ పరిస్థితికి కారణం మీరే అని నేను కేసీఆర్ ఫామ్‌హౌజ్ ఎదుట దీక్ష చేస్తా అని జగ్గారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏ మొహం పెట్టుకొని హరీష్ రావు ఢిల్లీ వెళ్లి దీక్ష చేస్తారని ప్రశ్నించారు. పదేళ్ల పాటు తెలంగాణ ప్రజలను కేసీఆర్ నిండా ముంచాడని మండిపడ్డారు. మల్లన్న సాగర్ రైతుల వీపులు పగలగొట్టినప్పుడు.. ఖమ్మం రైతులకు బేడీలు వేసినప్పుడు ఏం చేశారని హరీష్ రావును జగ్గారెడ్డి ప్రశ్నించారు.


Similar News