Jagadish Reddy: ప్రతిపక్షంగా ఇంకా మేము పని మొదలు పెట్టలేదు
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీపై కాంగ్రెస్ పగటి దొంగలా దొరికిందని విమర్శించారు. 17 లక్షల 13 వేల మందికి రుణమాఫీ చేయలేదని స్వయంగా మంత్రి ఉత్తమ్ ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ముందు రూ.31 వేల కోట్లు పూర్తిగా చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇది ఏ తేదీలోపు చేస్తారో స్పష్టంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రుణమాఫీ పూర్తయిందని డ్యాన్సులు చేస్తున్నారు. మంత్రులు మరోలా మాట్లాడుతున్నారు. సీఎం చెప్పింది అబద్ధమని ఉత్తమ్ మాటలతో అర్థం అవుతోందని జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంగా ఇంకా తాము పని మొదలు పెట్టలేదు. ముందు ముందు మా తడఖా ఏమిటో చూపిస్తామని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. రైతులు ఆందోళన చేస్తే భయపెట్టిస్తారు. పోలీస్ స్టేషన్‌లో పెడతారు. బీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుంది.
సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న మా డిమాండ్‌పై సీఎం రేవంత్ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. తెలంగాణ సోయి, ఆత్మలేని వ్యక్తులు సచివాలయంలో ఉండటం ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా తాము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం. రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్‌లోనో లేదంటే రేవంత్ తన ఇంట్లోనో పెట్టుకోవాలి.. రేవంత్ గాంధీ భవన్‌లో ఎన్ని రోజులు ఉంటారో తెలియదు.. అందుకే రాజీవ్ విగ్రహం పెట్టడం లేదు. సీఎం పదవిలో ఉండి తెలంగాణ తల్లి పై చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం?.. రాజీవ్ గాంధీ నోటి నుంచి ఒక్కసారైనా తెలంగాణ పదం ఉచ్చరించారా? అని మంత్రులను జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.