వంశీరామ్ బిల్డర్స్'లో ముగిసిన ఐటీ సోదాలు..

రియల్ ఎస్టేట్ సంస్థ ‘వంశీరామ్ బిల్డర్స్’లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. మొత్తం ఆరున్నర రోజుల పాటు ఈ సంస్థ

Update: 2022-12-11 07:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రియల్ ఎస్టేట్ సంస్థ 'వంశీరామ్ బిల్డర్స్'లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. మొత్తం ఆరున్నర రోజుల పాటు ఈ సంస్థకు చెందిన డైరెక్టర్ల ఆఫీసులు, నివాసాల్లో సోదాలు జరిగాయి. భారీ స్థాయిలో స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఐటీ ఆఫీసర్లు ఈ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. ఆ సంస్థ అధినేత సుబ్బారెడ్డి నివాసంలో వరుసగా మూడు రోజుల పాటు జరిగిన సోదాల్లో భారీ స్థాయిలో బంగారం, నగదు, భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమైనట్లు సమాచారం. ఈ ఆరున్నర రోజుల సోదాల్లో సుబ్బారెడ్డి సమీప బంధువుల ఇండ్ల నుంచి కూడా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను, పత్రాలను ఐటీ టీమ్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బ్యాంకు లాకర్లలో కూడా మరికొన్ని లభ్యమయ్యాయి.

ఐటీ రిటన్‌లలోని వివరాలను విశ్లేషించిన తర్వాత వచ్చిన సందేహాలతో లెక్కల్లోకి రాని ఆర్థిక లావాదేవీలు భారీ స్థాయిలో జరుగుతున్న అనుమానంతో వంశీరామ్ బిల్డర్స్ సంస్థపై మంగళవారం ఐటీ సోదాలు మొదలయ్యాయి. చాలాచోట్ల ఇవి మూడు రోజుల క్రితమే ముగిసినా అధినేత సుబ్బారెడ్డి, బంధువులు ఇండ్లలో మాత్రం ఆరు రోజుల పాటు కొనసాగాయి. గతంలో ఫీనిక్స్ సంస్థల్లో సోదాలు మూడు రోజుల పాటు, మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇండ్లు, వ్యాపార సంస్థల్లో రెండున్నర రోజుల పాటు కొనసాగాయి. ఇప్పుడు 'వంశీరామ్ బిల్డర్స్'లో మాత్రం ఏకంగా ఆరున్నర రోజుల పాటు జరిగాయి. ఐటీ శాఖ అధికారికంగా స్టేట్‌మెంట్ ఇస్తే నిర్దిష్టంగా ఈ సోదాల్లో ఏమేం స్వాధీనమయ్యాయో తెలుస్తుంది.


Similar News