టీ-కాంగ్రెస్ భారీ స్కెచ్.. ఫేజ్-2 బస్సుయాత్రకు రంగంలోకి మరో అగ్రనేత..?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొదటి దశ బస్సుయాత్ర కంప్లీట్ అయింది. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ప్రారంభించిన యాత్రకు వచ్చిన మైలేజ్‌తో ఉత్తర తెలంగాణ కేడర్‌లో జోష్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొదటి దశ బస్సుయాత్ర కంప్లీట్ అయింది. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ప్రారంభించిన యాత్రకు వచ్చిన మైలేజ్‌తో ఉత్తర తెలంగాణ కేడర్‌లో జోష్ పెరిగిందని పీసీసీ నేతలు అభిప్రాయపడ్డారు. మిగిలిన ప్రాంతాల్లో కొనసాగే సెకండ్ ఫేజ్ బస్సుయాత్రకు సోనియాగాంధీని రప్పించాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. సోనియా గాంధీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆమె పర్యటనను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ షెడ్యూలు ఖరారు కానున్నది.
రాహుల్ టూర్‌తో జోష్..
మూడు రోజుల రాహుల్‌గాంధీ టూర్‌తో రాష్ట్రంలో ఒక వేవ్ వచ్చిందనే సంతోషాన్ని పలువురు పీసీసీ నేతలు వ్యక్తం చేశారు. సోనియాగాంధీ వచ్చిన తర్వాత అది మరింత ఊపందుకుంటుందనే అభిప్రాయంతో ఉన్నారు. తెలంగాణ పీసీసీ తరఫున ఏఐసీసీ నేతలకు ఇప్పటికే మౌఖికంగా విజ్ఞప్తులు వెళ్లాయి. త్వరలోనే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితిని వివరించి సోనియాగాంధీని మరోసారి రాష్ట్రానికి రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
బస్సుయాత్ర సెకండ్ ఫేజ్‌కు రప్పించాలా? లేక హైదరాబాద్ శివారు ప్రాంతంలో మరో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి చీఫ్ గెస్టుగా పిలవాలా? అనేది పీసీసీ నేతలు పరస్పరం చర్చించుకుని నిర్ణయం తీసుకోనున్నారు. సోనియాగాంధీ టూర్ షెడ్యూలును గమనంలో ఉంచుకుని కీలకమైన సమయంలో తెలంగాణకు రప్పించడం ద్వారా ప్రచారానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్లవుతుందన్నది పీసీసీ నేతల ఆలోచన.
నామినేషన్లు పూర్తయ్యాకే..
నామినేషన్ల ప్రక్రియ తర్వాత సోనియాగాంధీని పిలిపించే అవకాశమున్నది. అభ్యర్థుల జాబితా రెండు మూడు రోజుల్లో విడుదలైన తర్వాత పార్టీ యాక్టివిటీస్ మరింత ముమ్మరం కానున్నాయి. ఈ నెల చివరికల్లా ఈ ప్రక్రియ కొలిక్కి వస్తే వచ్చే నెల 3-9 తేదీల మధ్య నామినేషన్ల ప్రాసెస్ కంప్లీట్ అవుతుందని, అప్పటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ తారస్థాయికి చేరుకుంటుందని, అప్పుడు సోనియాగాంధీని రప్పించడం ఉపయోగకరంగా ఉంటుందని పలువురు సీనియర్ నేతలు భావిస్తున్నారు.
రాహుల్‌గాంధీ స్పీచ్‌తో ప్రజలు, కేడర్‌లో కొత్త వేవ్ జనరేట్ అయిందని, సోనియాగాంధీ వచ్చిన తర్వాత స్పష్టమైన మెసేజ్ ఓటర్లకు రీచ్ అవుతుందని స్టేట్ లీడర్లు భావిస్తున్నారు. ఇప్పటివరకూ దక్షిణ తెలంగాణలో పార్టీ బలంగా ఉన్నదనే స్పష్టత పీసీసీ లీడర్లలో ఉన్నా ఉత్తర తెలంగాణలో బలహీనంగా ఉన్నామనే అభిప్రాయం ఉండేదని, రాహుల్ టూర్‌తో ఆ గ్యాప్ భర్తీ అయిందని ఓ నేత పేర్కొన్నారు.