ఇది స్కూల్ కాదు దేవాలయం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Update: 2024-10-11 10:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు దేవాలయం వంటిదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గం మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమత బేధాలు, గొప్ప పేద వంటి తారతమ్యాలు ఉండకుండా సమాజ నిర్మాణానికి, అందరికి ఒకే రకమైన విద్యకు ఇటువంటి స్కూల్స్ రావాలని వ్యాఖ్యానించారు. కులం లేదు మతం లేదు మనమంతా ఒక్కటేనన్న భావనతో రేపటి పౌరులు మానవత్వంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఈ స్కూల్స్ నిర్మిస్తుందన్నారు. తొలి దశలో నా నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదలన్నారు. మండలానికి ఆరు పాఠశాలల చొప్పున 50 పాఠశాలలు కట్టించే బాధ్యత నాదన్నారు.

అభివృద్ధి విషయంలో తెలంగాణ మొత్తం వచ్చి మునుగోడును చూసి వెళ్లాలని, మునుగోడు నియోజకవర్గానికి విద్యా వైద్య విషయంలో నిర్లక్ష్యం జరిగిందన్నారు. దానిని సరి చేయాల్సిన బాధ్యత నాతోపాటు మీ అందరి పైన ఉందన్నారు. 119 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బెల్ట్ షాపులు మూసి వేయలేదని మునుగోడు ఎమ్మెల్యే తప్ప అని తెలంగాణ మొత్తం మాట్లాడుకుంటున్నారని, అదే పద్ధతిలో నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడుకోవాలన్నారు. మీ గ్రామాల అభివృద్ధి జరగాలంటే విద్య వైద్యం వికసించాలంటే ప్రజలందరూ బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు.

గత ప్రభుత్వంలో నా రాజీనామాతో నియోజకవర్గానికి 600 కోట్ల రూపాయల నిధులు వచ్చాయన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రభుత్వం విద్య వైద్యాన్ని ప్రైవేటు పాలు చేసిందని, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రాజెక్టులలో అన్యాయం జరిగిందన్నారు. జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా ప్రాజెక్టుల విషయంలో అభివృద్ధిలో రాజీ పడడం లేదని, త్వరలోనే ఎస్ ఎల్బీసీ సొరంగ మార్గం, బ్రాహ్మణ వెల్లంల, శివన్నగూడెం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని స్పష్టం చేశారు. 


Similar News