Disha Special Story : మేలు కంటే నష్టమే ఎక్కువ.. సోలార్ ప్యానళ్లతో కొత్త ఆందోళన నిజమేనా?

సోలార్ ప్యానళ్లతో కొత్త ఆందోళన నిజమేనా?

Update: 2024-10-21 08:56 GMT

మానవ సమాజం అభివృద్ధి పంథాలో దూసుకుపోవాలంటే కొత్త ఆవిష్కరణలు అత్యంత కీలకం. మానవుడి మస్తిష్కంలో పురుడుపోసుకున్న కొత్త ఆవిష్కరణలెన్నో మనిషి జీవన గమనాన్ని మార్చివేశాయి. అలాంటి వాటిలో ఎలక్ట్రిసిటీ ఒకటి. ప్రస్తుతం విద్యుత్ వినియోగం లేని ప్రపంచాన్ని ఊహించడం అసాధ్యం. అందుకే రోజు రోజుకు విద్యుత్ వినియోగం పెరిగిపోతుంటే విద్యుత్ ఉత్పత్తి కోసం కొత్త మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచానికి భూతాపం పెనుశాపంగా మారిన వేళ విద్యుత్ ఉత్పత్తి కోసం శిలాజ ఇంధనాలను ఉపయోగించడానికి బదులుగా పునరుత్పాదక శక్తిని ఉపయోగించుకునేందుకు రెట్టింపు ప్రయత్నాలు, పథకాలు పురుడు పోసుకుంటున్నాయి. ఇందులో భాగంగా భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చిదిద్దడంలో సోలార్ విద్యుత్ అనేది గేమ్ చేంజర్ అని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ, రాయితీలు ప్రకటిస్తున్నది. దీంతో సోలార్ వినియోగం వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. - జూకంటి ప్రసాద్

సౌర విప్లవం దిశగా భారత్

దేశ ఆర్థికాభివృద్ధికి ఇంధనం అత్యంత కీలకం. పెట్రోల్, డీజీల్, విద్యుత్ సరిపడా ఉంటేనే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉంటుంది. అయితే మన దేశంలో భారీగా చమురు నిల్వలు లేనందున.. ఇతర దేశాలపైనే ఆధారపడాల్సి వస్తున్నది. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద చమురు దిగుమతి, వినియోగ దేశంగా ఉంది. దీంతో దేశ ఖజానాలో అధిక మొత్తం చమురు దిగుమతులకే వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. విద్యుదుత్పత్తి కోసం బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంట్ల వాటానే సుమారు 75 శాతం ఉంటున్నది. దీంతో ఆర్థిక భారం, పర్యావరణ నష్టం కలుగుతున్నది. ఈ పరిస్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వం గడిచిన పదేళ్లుగా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానించడానికి 2015 నుంచి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును నిర్వహిస్తున్నది. దీనికి సంబంధించిన నాలుగో సదస్సు ఎక్స్ పో ఇటీవలే గుజరాత్‌లో ప్రధాని ప్రారంభించారు. ఈ సదస్సు వేదికగా పునరుత్పాదక రంగంలో భారత దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలను ప్రధాని స్పష్టం చేశారు. ముఖ్యంగా మనదేశంలో 2030 నాటికి విద్యుత్‌లో 50 శాతం శిలాజేతర వనరుల నుంచే సాధించాలని భారత దేశం టార్గెట్ పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. సౌర, పవన, అణు, జల విద్యుదుత్పత్తి ద్వారా దేశ 21వ శతాబ్ద చరిత్రలో సౌర విప్లవ అధ్యాయాన్ని సువర్ణాక్షరాలతో రాస్తామని స్పష్టం చేశారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఇప్పటికే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం సదస్సులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ‘సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన స్కీమ్’ను పీఎం ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందించేందుకు వీలుగా ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ సోలార్ స్పీడ్

2035 నాటికి 40 వేల మెగావాట్ల హరిత ఇంధనం ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఇదే కార్యక్రానికి హాజరైన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించగా, 20230 నాటికి 72.60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉందని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు వెల్లడించారు. తెలంగాణలో త్వరలోనే రైతులకు సోలార్ పంపు సెట్లు, గృహాలపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసి ఇంటి అవసరాలకు విద్యుత్‌ను వారే ఉత్పత్తి చేసుకునేలా సోలార్ సెట్లను ఇవ్వాలని చూస్తున్నది. ఈ మేరకు సోలార్ పవర్ విధానాన్ని తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందుకోసం అటవీ, వివిధ శాఖల భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఏటా 40 వేల మెగా వాట్ల కరెంట్ అందుబాటులో ఉండేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నది.

సూర్య ఘర్‌తో భారీగా సబ్సిడీ

ఇంటిపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన స్కీమ్ కింద ఒక్కో కిలోవాట్ కు రూ.30 వేల సబ్సిడీ అందిస్తున్నది. ఈ సబ్సిడీ అందుకోవాలంటే ముందుగా పీఎం సూర్య ఘర్ పోర్టల్ www.pmsuryaghar.gov.in లో రిజిస్టర్ చేసుకోవాలి. మీ రాష్ట్రం, విద్యుత్తు సరఫరా కంపెనీ ఎంపిక చేసుకోవాలి. విద్యుత్ కనెక్షన్ నంబర్, ఫోన్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ ఇవ్వాలి. ఆ తర్వాత మీ విద్యుత్తు కన్జ్యూమర్ నంబర్, ఫోన్ నంబర్‌తో లాగిన్ కావాలి. రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లయ్ చేయాలి. ఫారం నింపిన తర్వాత డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చే వరకు వేచి ఉండాలి. అనుమతులు వచ్చిన తర్వాత డిస్కమ్ గుర్తింపు పొందిన విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత వివరాలను పోర్టల్‌లో సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేయాలి. నెట్ మీటర్‌ ఇన్‌స్టాల్ చేశాక డిస్కమ్ అధికారులు తనిఖీ చేస్తారు. ఆ తర్వాత కమిషనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు. ఈ రిపోర్ట్ వచ్చాక మీ బ్యాంకు ఖాతా వివరాలతో క్యాన్సిల్ చేసిన చెక్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. 30 రోజుల్లో సబ్సిడీ వస్తుంది.

ప్యానల్స్ వినియోగంపై ఆందోళన

ప్రస్తుతం ప్రపంచానికి భూతాపం పెను శాపంగా మారింది. ఫలితంగా ప్రకృతిలో సమతూల్యం లోపించి అనేక విపత్తులకు కారణం అవుతున్నది. దీంతో లెక్కకు మించి ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. సంప్రదాయ ఇంధన వనరుల వినియోగం వల్ల హరిత గృహ వాయులు, CO2 ఉద్గారాలు అధికమై గ్లోబల్ వార్మింగ్‌కు దారి తీస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే శిలాజ ఇంధన వనరుల వినియోగం తగ్గించి పునరుత్పాదక శక్తి వైపు మళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ క్రమంలో సోలార్ విద్యుత్ వైపు అంతా అడుగులు వేస్తుంటే ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా సూర్యతాపం పెరిగిపోతుందనే వాదన బలంగా వినిపిస్తున్నది. ఇప్పటికే దేశంలో రికార్డు స్థాయిలో ఢిల్లీలో 48 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదు కావడం అందరిని టెన్షన్ పెట్టించింది. ఇటువంటి తరుణంలో సోలార్ ప్యానల్స్ వాతావరణలో ఉష్ణోగ్రత రెట్టింపు చేస్తోందనే చర్చ హాట్ టాపిక్ అవుతున్నది.

మేలు కంటే నష్టమే ఎక్కువ: డాక్టర్ యిబ్రం గణేశ్, సైంటిస్టు- ఏఆర్ సీఐ , హైదరాబాద్

పర్యావరణానాన్ని పరిరక్షించాలంటే శిలాజఇంధన వనరుల వినియోగం తగ్గించి పునరుత్పాదక శక్తి వైపు మళ్లాలి. 2022లో ప్రపంచానికి అవసరమైన మొత్తం విద్యుత్‌లో సోలార్ పవర్ ద్వారా వచ్చింది కేవలం 0.2 శాతం మాత్రమే. 2023 ‌లో శిలాజ ఇంధనాన్ని బర్న్ చేయడం ద్వారా 38 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలైంది. దీంతో చాలాచోట్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలలో ఈ ఇంధనాల వినియోగంతోపాటు సోలార్ ప్యానల్స్ ప్రభావం కూడా ఉంది. 2010 నుంచి ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున సోలార్ ప్యానల్స్ ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీని ఆల్టర్నేట్ ఎనర్జీ రీసోర్స్‌గా ఉపోయోగించుకోవచ్చు కానీ సేఫ్ ఎనర్జీ రీసోర్స్‌గా ఉపయోగించలేం. ఇవాళ ఉన్న సోలార్ ప్యానెల్స్ ఒక గంటలో ఒక స్క్వేర్ మీటర్ ఏరియాలో యావరేజ్‌గా 1 కిలోవాట్ అవర్ సన్ లైట్ తీసుకుంటుంది.

ఇందులో నుంచి 20 శాతం లైట్‌ను ఎలక్ట్రిసిటీ‌గా కన్వర్ట్ చేసి 30 శాతం కంటే ఎక్కువ లైట్‌ను హీట్ ఎనర్జీ జనరేట్ చేస్తాయి. అంటే తక్కువ ఎలక్ట్రిసిటీ ఎక్కువ హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాయి. 2 /1 మీటర్ ఏరియా ఉన్న సోలార్ ప్యానల్ వాతావరణంలో 10 లీటర్ వాల్యూమ్‌ను ఆక్రమించిందనుకుంటే ఆ 10 లీటర్ వాల్యూమ్‌లో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ఎంతైతే వేడిని ఉత్పత్తి చేసి గ్లోబల్ వార్మింగ్ కారణం అవుతుందో దానికంటే 1 మిలియన్ టైమ్స్ ఎక్కువ గ్లోబల్ వార్మింగ్‌ను ఈ సోలార్ ప్యానల్స్ చేస్తాయి. శిలాజ ఇంధన వినియోగం తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వం ఇంటి పై కప్పులపై సైతం సోలార్ ప్యానల్స్ ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. కానీ నిజానికి సోలార్ ప్యానల్స్ పర్యావరణానికి మేలు చేయడం కంటే ఎక్కువ నష్టం చేస్తున్నాయి. అందుకే ప్రస్తుతం ఉన్న ఎస్పీవీసీ (సిలికాన్ ఫొటోవోల్యాటిక్) ప్యానెల్స్ స్థానంలో ఎస్ఎల్ఏపీఈ సోలార్ ప్యానెల్స్ ను అభివృద్ధి చేయాల్సి ఉంది. అప్పుడు హీట్ ఎనర్జీ దాదాపుగా తగ్గి.. విద్యుత్ ఉత్పత్తితోపాటు పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటుంది. 

 


Similar News