ముందస్తుకే మొగ్గు.. KCR వ్యుహమదేనా?

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా? అందుకే అభివృద్ధి పనుల్లో సీఎం కేసీఆర్ వేగం పెంచారా? డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహబూబ్ నగర్ , జగిత్యాల జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది.

Update: 2022-11-26 08:24 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా? అందుకే అభివృద్ధి పనుల్లో సీఎం కేసీఆర్ వేగం పెంచారా? డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్ నగర్ , జగిత్యాల జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. శనివారం నిజామాబాద్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ జిల్లాకు రూ.100 కోట్లు ప్రకటించారు. దళిత బంధు యూనిట్ల ఎంపిక ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఇప్పటికే ఆయా జిల్లా మంత్రులకు సీఎం సూచించారు. డబుల్ బెడ్రూం పంపిణీపై ఇటీవల రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని త్వరగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు అసెంబ్లీ సమావేశాలను వారం పాటు నిర్వహించేందుకు ఇటీవల సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన రూ.40వేల కోట్ల నిధులను చెల్లించడం లేదని ఆరోపించారు. ఇవన్నీ ముందస్తుకే సంకేతాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ సారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

కీలక పరిణామాలు.. అందుకే దూకుడు

రాష్ట్రంలో వరుసగా అధికార టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒక వైపు ఈడీ, ఐటీ దాడులు జరుగుతుండగా పరిస్థితి చేయి దాటక ముందే ముందస్తుకు వెళ్లాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలకు ఎర కేసు తమకు కలిసొస్తుందని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది. మంత్రులపై దాడులు తమ పార్టీపై కక్ష సాధింపు చర్యగా భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ అంశాన్ని ఇప్పటికే ప్రతి వేదికపై ప్రస్తావిస్తున్నారు. ఈ దఫా బీజేపీతో ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన సీఎం ఎలాగైనా పెండింగ్ సమస్యలు పరిష్కరించి ముందస్తుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మునుగోడు ఎన్నికల తర్వాత పాలన పరమైన అంశాల్లో వేగం పెంచిన కేసీఆర్ బీజేపీని నిలువరించేందుకు ముందస్తు ప్రత్యామ్నాయమని భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో కూడా ముందస్తుకు వెళ్లిన సీఎం కేసీఆర్ సంపూర్ణ మెజారిటీతో రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

అభివృద్ధి పనుల్లో వేగం..

జనవరిలో సెక్రటరేట్ ప్రారంభించేందుకు సంక్రాతిని ముహుర్తంగా ఫిక్స్ చేసినట్లు తెలిసింది. గ్రూప్ 4 నియామకాల నోటిఫికేషన్ విడుదల కూడా చేపట్టిన ప్రభుత్వం నియామకాల ప్రక్రియపై ఫోకస్ పెంచింది. త్వరితగతిన ఖాళీలను భర్తీ చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసొస్తుందని యోచిస్తోంది. అంబేద్కర్ విగ్రహాన్ని కూడా త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే త్వరితగతిన జిల్లా కలెక్టరేట్ల సమీకృత భవనాలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను అందుబాటులో ఉంచి సమస్యలపై ఫోకస్ పెట్టాలని సూచించినట్లు తెలిసింది. మంత్రులకు ఆయా జిల్లాల ప్రధాన సమస్యలపై పూర్తి సమాచారం అందించాలని సూచించినట్లు తెలిసింది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అంశాలపై దృష్టి సారించి వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రులను ఇప్పటికే ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతుందోననే చర్చ సాగుతోంది. మరి ముందస్తు ఈ సారి కేసీఆర్ కు కలిసొస్తుందా లేదా అనేది కొన్ని రోజుల్లో తేలనుంది.

Read more:

నా ప్రైవసీకి భంగం వాటిల్లుతోంది...ఆ విషయంలో నాకు ఇంకా అనుమానం ఉంది....మరోసారి గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు

Tags:    

Similar News