ఇంటర్ రిజల్ట్స్ ఈ నెల మొదటి వారంలో విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. గత నెలలోనే మూల్యాంకన ప్రక్రియ ముగిసినా.. టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. గతేడాది చేదు అనుభవాలు మరోసారి ఎదురుకాకుండా, సాంకేతిక సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఏపీ, తెలంగాణలో ఒకేసారి ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించగా, ఏపీలో గత నెల 26నే ఫలితాలను విడుదల చేశారు. మన రాష్ట్రంలో మాత్రం ఆలస్యమవుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ఒకేసారి ప్రారంభమయ్యాయి. మార్చి 15న పరీక్షలు స్టార్ట్స్ కాగా, ఏప్రిల్ 4వ తేదీన ముగిశాయి. అయితే ఏపీలో ఏప్రిల్ 26న ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. కానీ తెలంగాణలో ఇంకా విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ సైతం గత నెలలోనే ముగిసింది. అయినా ఫలితాలు విడుదల చేయడానికి అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు.
సాంకేతిక సమస్యలేనా!
తెలంగాణలో ఇంటర్ ఫలితాల జాప్యానికి కారణం టెక్నికల్ సమస్యలేనని తెలుస్తున్నది. గతేడాది టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా చాలా మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. పలువురు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురుకాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికారులు రిజల్ట్స్ కు సంబంధించిన ప్రాసెస్ ను పూర్తిచేసే పనిలో నిమగ్నమైనట్లు చెబుతున్నారు. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని అంతా ఓకే అనుకున్నాకే ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అధికారుల ప్రాసెసింగ్ సక్సెస్ అయ్యాక విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారు ఓకే చెబితే మరుక్షణమే రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని భావిస్తున్నారు.
మే మొదటి వారంలోనే..!
తెలంగాణలో ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,47,699 మంది ఇంటర్ స్టూడెంట్స్ పరీక్షలు రాశారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను మొదట ఆన్ లైన్ పద్ధతిలో చేపట్టాలని భావించారు. ఇందుకు ఇంటర్ బోర్డు టెండర్లను సైతం ఆహ్వానించింది. కానీ బిడ్డింగ్ కు ఎవరూ ముందుకు రాకపోవడంతో అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇది కూడా రిజల్ట్స్ ఆలస్యానికి కారణంగా తెలుస్తున్నది. అయితే మే 10వ తేదీలోపు ఎట్టి పరిస్థితుల్లో ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అన్నీ ఓకే అయితే మొదటి వారంలోనే రిజల్ట్స్ రిలీజ్ చేసే అవకాశమున్నది.