ఎస్సీ, ఎస్టీలకు పోలీస్ నియామకాల్లో అన్యాయం.. రేవంత్‌కు నిరుద్యోగ జేఏసీ వినతి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పోలీసు నియామక మండలి నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పోలీసు నియామక మండలి నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్ వి. భీంరావు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలసి జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వి.భీంరావు నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ మధ్య కాలంలో నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని తెలిపారు. గతంలో రెండు సార్లు ఇచ్చిన 2014, 2018 నోటిఫికేషన్లలో ఓసీలకు 80, బీసీలకు 70, ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులుగా ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టి, నెగెటివ్ మార్కులు లేకుండా పరీక్షను నిర్వహించడం జరిగిందన్నారు. నూతనంగా ఇచ్చిన 2022 నోటిఫికేషన్‌లో నెగటివ్ మార్క్స్ పెట్టి అందరికీ కామన్‌గా 60 మార్కులకే కటాఫ్ తీసుకురావడానికి ఎస్సీ, ఎస్టీ,బీసీలు అభ్యర్థులు వ్యతిరేకించారని వివరించారు. ఓసీలకు 20 మార్కులు తగ్గించినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 20 మార్కులు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రమైన రిజర్వేషన్ రూల్స్‌కు వ్యతిరేకంగా రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని కొత్త జీవో జారీ చేసి ఎస్సీ, ఎస్టీలకు 40, బీసీలకు 50, ఓసీలకు 60 మార్కులుగా క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టి ఫలితాలు విడుదల చేయాలని కోరారు. అదే విధంగా ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో దాదాపు 22 ప్రశ్నలు తప్పులుగా రావడం, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో 23 ప్రశ్నలు తప్పులుగా రావడం బోర్డు తప్పిదమని, తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకు ప్రతి అభ్యర్థులకు మార్కులు కలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 12 న ఇంద్ర పార్క్ ధర్నా చౌక్‌లో రిలే దీక్ష కొనసాగిస్తామని వెల్లడించారు.