KCRకు గాయం.. ప్రొటెమ్ స్పీకర్ విషయంలో రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..?

తెలంగాణ అసెంబ్లీలో ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని నియమించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Update: 2023-12-08 07:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీలో ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని నియమించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకీ సీఎం రేవంత్ రెడ్డి సమాచారం అందించినట్లు సమాచారం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు రేపు ఒక రోజు అసెంబ్లీ సెషన్ జరగనున్నది. సభలో సీనియర్లుగా ఉన్న ఎమ్మెల్యేలలో ఒకరిని ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ప్రస్తుతం ఎన్నికైన సభ్యుల్లో మాజీ సీఎం కేసీఆర్ సభలో అందరి కంటే సీనియర్. కానీ, ఆయన ఆసుపత్రిలో చేరడంతో రేపటి అసెంబ్లీ సమావేశానికి దూరంగానే ఉండనున్నారు. ఆ తరువాత మాజీ స్పీకర్ పోచారం, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో పాటు మరికొందరు సీనియర్లుగా ఉన్నారు. దీంతో ప్రొటెం స్పీకర్ అవకాశం సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి ఇస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ పేరు ఖరారైనట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ నిర్ణయాన్ని అసదుద్దీన్ ఓవైసీ అంగీకరిస్తే డిసెంబర్ 9న అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్‌గా సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Similar News