Bandi Sanjay : ఇందిరమ్మ అభయ హస్తం కాదు..భస్మాసుర హస్తం : కేంద్ర మంత్రి బండి సంజయ్
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ (Indiramma Atmiya Bharosa)పేరుతో రైతు భరోసా బకాయి చెల్లించకపోగా, ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతులకు ఇచ్చిన రైతు భరోసా(Rythu Bharosa) హామీకి సైతం తూట్లు పొడిచి ఇందిరమ్మ అభయ హస్తమంటే... భస్మాసుర హస్తమని నిరూపించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay)విమర్శలు గుప్పించారు.
దిశ, వెబ్ డెస్క్ : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ (Indiramma Atmiya Bharosa)పేరుతో రైతు భరోసా బకాయి చెల్లించకపోగా, ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతులకు ఇచ్చిన రైతు భరోసా(Rythu Bharosa) హామీకి సైతం తూట్లు పొడిచి ఇందిరమ్మ అభయ హస్తమంటే... భస్మాసుర హస్తమని నిరూపించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay)విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఆ తరువాత ప్రజలను దారుణంగా మోసం చెయ్యడం కాంగ్రెస్ డీఎన్ఏ లోనే ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ‘‘కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం’’ పేరుతో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హమీలకు, నేడు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు పొంతనే లేదని విమర్శించారు. ప్రతి రైతుకు, కౌలు రైతుకు ఎకరానికి రూ.15 వేలు చొప్పున, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా సొమ్ము చెల్లిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ నేడు అందుకు భిన్నంగా రూ.12 వేలు మాత్రమే రైతులకు ఇస్తానని ప్రకటించడమంటే రైతులను దగా చేయడమేనని మండిపడ్డారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని..అయినప్పటికీ ఏడాదిపాటు రైతు భరోసా చెల్లించకుండా ఎగ్గొట్టారని, ఆలస్యమైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని, గత ఏడాది చెల్లించాల్సిన బకాయి కూడా చెల్లిస్తారని ఆశించిన రైతులకు పూర్తి నిరాశే ఎదురైందని సంజయ్ విమర్శించారు. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అదనంగా నయాపైసా కూడా సాయం చేయలేదని తేటతెల్లమైందన్నారు. గతంతో పోలిస్తే కాంగ్రెస్ పాలనలో ఎకరాకు మరో రూ.2 వేల రూపాయలు రైతులు నష్టపోయినట్లయిందన్నారు. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో రైతు బంధు లబ్దిదారుల సంఖ్యలో భారీగా కోత విధించాలనుకుంటోందని, ఇప్పటికే రుణమాఫీ పేరుతో కోతలు పెట్టారని, అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని, సన్న వడ్లకే బోనస్ ను పరిమితం చేశారని, అది కూడా కొంత మంది రైతులకే బోనస్ చెల్లించారని సంజయ్ ఆరోపించారు.. 46 లక్షల మంది రైతులకు ‘రుణమాఫీ’ చెల్లిస్తామని 22 లక్షల మందికిపైగా రైతులకు ఎగ్గొట్టారని, రైతు సంక్షేమ ప్రభుత్వమంటే కోతలు విధించడమేనా? ఇందిరమ్మ పాలనంటే ఇచ్చిన మాట తప్పడమేనా? అని విమర్శించారు.
100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏడాదిపాటు తూట్లు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండో ఏడాదిలోనైనా వాటిని పూర్తిస్తాయిలో అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు నెలనెల రూ. 2500 రూపాయలు, తులం బంగారం, స్కూటీ ఇస్తామని తెలంగాణ ఆడబిడ్డలను నిండా ముంచారని, వృద్ధులు, వితంతవులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని చెబితే ఏడాదిగా ఎదురుచూస్తున్న అవ్వాతాతల నోట్లో మట్టికొట్టారని, రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తారని ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఎగనామం పెట్టారని విమర్శించారు. నెలానెలా రూ.4 వేల భ్రుతి ఇస్తారని, 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారని ఎదురు చూస్తున్న నిరుద్యోగులను నడిరోడ్డున పడేశారని, ఇల్లులేని పేదలందరికీ జాగా తోపాటు రూ. 5 లక్షల చొప్పున ఆర్దిక సాయం చేస్తామని హామీ ఇచ్చి పేదల బతుకులను బజారున పడేశారని బండి సంజయ్ దుయ్యబట్టారు.
ఓట్ల కోసం అందరినీ వాడుకుని అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా సొమ్ము ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. లేనిపక్షంలో అతి త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి నాయకత్వంలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేసి కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచుతామని ప్రకటించారు.