పంజాబ్ సీఎం దోచుకోవడం నేర్చుకోవడానికి వస్తున్నారేమో?
ఆమ్ ఆద్మీ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన ఇందిరా శోభన్ మరోసారి ఆ పార్టీ నేతలపై విమర్శలకు దిగింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన ఇందిరా శోభన్ మరోసారి ఆ పార్టీ నేతలపై విమర్శలకు దిగింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం రేపు తెలంగాణకు రాబోతున్న పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌పై సెటైర్లు వేసింది. సీఎం కేసీఆర్ తెలంగాణను ఎలా దోచుకుని దాచుకున్నారో నేర్చుకోవడానికి రాష్ట్రానికి వస్తున్నారేమో అంటూ వ్యాంగ్యాస్త్రాలు సంధించింది. కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం.. తెలంగాణ ప్రజలను అప్పుల పాలు చేసి, భూ నిర్వాసితుల కన్నీళ్లకు కారణం అయిన మల్లన సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి పంజాబ్‌లో కూడా ఏ విధంగా దోచుకుని దాచుకోవచ్చు అనేది నేర్చుకోవడం కోసమే భగవంత్ మాన్ తెలంగాణలో పర్యటించబోతున్నారేమో అని విమర్శించారు.
మంగళవారం ట్విట్టర్ వేదికగా ఇందిరా శోభన్ పై విధంగా రియాక్ట్ అయ్యారు. కాగా మూడు రోజుల పర్యటన నిమిత్తం భగవంత్ సింగ్ మాన్ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ తో స్పెషల్ గా భేటీ కానున్నారు. ఆయన వెంట ఆ రాష్ట్రానికి చెందిన సాగునీటి పారుదల శాఖ మంత్రి, అధికారులు సైతం రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం, మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా అధికారుల బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కాగా ఇటీవల జరిగిన ఖమ్మం బీఆర్ఎస్ సభకు వచ్చిన భగవంత్ మాన్ పంజాబ్ లోనూ కంటి వెలుగు లాంటి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తెలంగాణలో పర్యటించడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే రాజకీయంగా ఇటీవల బీఆర్ఎస్‌తో ఆమ్ ఆద్మీ అంటగాగుతోంది. ఈ వైఖరి నచ్చడం లేదంటూ ఇందిరా శోభన్ ఇటీవలే ఆమ్ ఆద్మీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.