ర్యాగింగ్ పేరుతో రాక్షసక్రీడలు.. ప్రీతి ఘటనపై ఇందిరా శోభన్ ఆగ్రహం
రాష్ట్రంలో ఆడపిల్లలకు చదువు శాపంగా మారిందని, ర్యాగింగ్‌ల పేరుతో రాక్షసక్రీడలు ఆడుతున్నారని సోషల్ యాక్టివిస్ట్ ఇందిరా శోభన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఆడపిల్లలకు చదువు శాపంగా మారిందని, ర్యాగింగ్‌ల పేరుతో రాక్షసక్రీడలు ఆడుతున్నారని సోషల్ యాక్టివిస్ట్ ఇందిరా శోభన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆమె వరంగల్ మెడికో స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్, హుమన్ రైట్స్, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మెడికో స్టూడెంట్ ప్రీతి చికిత్స పొందుతున్న నిమ్స్ ఆస్పత్రికి ఇందిరా శోభన్ వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగి ఒక రోజు గడిచినా ఇప్పటివరకు కూడా పోలీస్ అధికారులు స్పందించలేదని, ఎంక్వయిరీ చేయలేదని, ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని ప్రశ్నించారు. ఈ కేసును పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రీతి సంఘటనలో అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. వరంగల్ కేఏంసీలో అసలు ఏం జరిగుతున్నదని ప్రశ్నించారు. కేఎంసీ ప్రిన్సిపాల్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్ జరిగినట్లు చెప్పొద్దంటూ ప్రిన్సిపాల్ పలువురిపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. బాధ్యులను సస్పెండ్ చేయాలని, కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్యవతి రాథోడ్ జాతి బిడ్డయి మంత్రిగా ఉండి కనీసం ఏం జరిగిందో కూడా తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని నిలదీశారు.