మంత్రి పొంగులేటి వద్ద డ్రాఫ్ట్ పాలసీ.. వచ్చే అసెంబ్లీ సెషన్‌లోనే కొత్త ఆర్వోఆర్ చట్టం!

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త ఆర్వోఆర్ యాక్ట్ ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

Update: 2024-07-21 02:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త ఆర్వోఆర్ యాక్ట్ ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మెరుగైన రెవెన్యూ చట్టాలపై అధ్యయనం చేసిన తర్వాత.. వాటి ఆధారంగా తెలంగాణ భౌగోళిక, భూ పరిపాలనకు అనువైన చట్టాన్ని రూపొందించినట్లు సమాచారం. భూ చట్టాల నిపుణులు, కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో డ్రాఫ్ట్ పాలసీని రూపొందించగా.. అధికార యంత్రాంగమంతా సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూడా కొత్త చట్టంపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే శనివారం సీఎం రేవంత్ రెడ్డితో జరగాల్సిన అధికారుల సమావేశం రద్దయ్యింది. దీంతో త్వరలోనే దీనిపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

కొత్త చట్టమే పరిష్కారం

ఆర్వోఆర్ యాక్ట్ -2020లోని లోపాలు, పొరపాట్ల కారణంగానే అనేక భూ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. పైగా వాటి పరిష్కారానికి మార్గాలు కూడా లేకుండా చేశారు. కనీసం దరఖాస్తుదారుడు తనకు అన్యాయం జరిగిందని అప్పీల్ చేసుకునే వ్యవస్థ లేకుండా చేశారు. ధరణి రికార్డు ఫైనల్ అన్నట్లుగా తయారు చేశారు. పైసా ఖర్చు లేకుండా చేయాల్సిన పనులకు ముక్కు పిండి ప్రతి దరఖాస్తుకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేశారు. రిజెక్ట్ చేస్తే మళ్లీ అప్లయ్ చేసుకోవాలంటే మరో రూ.వెయ్యి సమర్పించుకోవాల్సిందే. ఆఖరికి స్లాట్ రద్దయితే తిరిగి స్టాంప్ డ్యూటీ సొమ్ము పొందే వ్యవస్థ లేని ధరణి పోర్టల్ ని తెలంగాణ ప్రజలపై రుద్దారు. అయితే ఇన్ని లొసుగులతో కూడిన చట్టం అమలు ద్వారా మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని రెవెన్యూ నిపుణులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఒకటీ, రెండు సవరణలతో మెరుగైన భూ పరిపాలన వ్యవస్థ ఏర్పడదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ధరణి కమిటీ సభ్యుల్లో ఒకరు మినహా అందరూ కొత్త ఆర్వోఆర్ చట్టానికే మొగ్గు చూపినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ధరణికి చికిత్స

ధరణి పోర్టల్ నిర్వహణ చేపడుతున్న విదేశీ కంపెనీ నుంచి విముక్తి కల్పించనున్నారు. అయితే అంతకు ముందే దీనికి చికిత్స చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ధరణి కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయడానికి అవసరమైన చర్యలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించనున్నారు. 33 మాడ్యూళ్లతో సృష్టించిన గందరగోళానికి చెక్ పెట్టనున్నారు. ఏ సమస్యకు ఏ మాడ్యూల్ అనేది సామాన్యుడికి ఎలా అర్ధమవుతుంది? ఒక సమస్య ఉందని అప్లయ్ చేస్తే అది ఏ విభాగం, ఏ అంశం కిందికి వస్తుందో అధికారులు నిర్ణయించాల్సిందే. సింగిల్ విండో సిస్టంతోనే అప్లయ్ చేసుకునే వ్యవస్థను రూపొందించనున్నట్లు తెలిసింది. ఏ సమస్యకైనా అప్లికేషన్ ఒక్కటే, మాడ్యూల్ ఒక్కటే. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అవసరమైతే దరఖాస్తుదారుడికి సమాచారం ఇచ్చి తెప్పించుకోవడమే అధికారుల విధిగా పోర్టల్ ని మార్చాలని సిఫారసులు అందాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగే ధరణి పోర్టల్ ని మార్చనున్నారు. అయితే ధరణి పోర్టల్ నుంచి భూమాతగా మారేందుకు మాత్రం చట్ట సవరణ అనివార్యం. అందుకే పేరు మార్పు ప్రక్రియ కొత్త ఆర్వోఆర్ చట్టం ద్వారానే ఉంటుందని తెలిసింది.

సాదాబైనామాలపైనా నిర్ణయం

2020లో తీసుకొచ్చిన ఆర్వోఆర్ చట్టం, పాత చట్టాల మధ్య సాదాబైనామా దరఖాస్తులు పెండింగులో పడ్డాయి. పాత చట్టం ప్రకారమైతే 3 లక్షల దరఖాస్తులను పరిష్కరించొచ్చు. కొత్త చట్టం అమలు తర్వాత దాఖలైన సుమారు 6 లక్షల అప్లికేషన్లకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో నాలుగేండ్ల నుంచి పెండింగులో ఉన్న 9 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన చర్యలపై రేవంత్ సర్కార్ చర్చిస్తున్నది. త్వరలోనే వీటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా కొత్త చట్టంలోనే పొందుపరిచాలా? మరేదైనా మార్గం ఉందా? అన్న విషయంపై అధికారులు, నిపుణులతో చర్చించనున్నారు.


Similar News