చెరువుకు చెర..! యథేచ్ఛగా బొమ్మకల్ మల్ల చెరువులో ఆక్రమణలు

సాగుకు కీలక వనరుగా ఉన్న చెరువులను అక్రమార్కులు చెర పడుతున్నారు.

Update: 2024-10-24 02:13 GMT

దిశ బ్యూరో కరీంనగర్: సాగుకు కీలక వనరుగా ఉన్న చెరువులను అక్రమార్కులు చెర పడుతున్నారు. రియల్టర్ల దెబ్బకు చెరువులే మాయమవుతున్నాయి. ఓ వైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో హైడ్రా ఏర్పాటుతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. కానీ, కరీంనగర్ జిల్లాలో మాత్రం అక్రమణ దారులు చెరువులను చెరపడుతూ రూ. కోట్లు దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న బొమ్మకల్ మల్ల చెరువుపై ఆక్రమణదారులు కన్నేసి యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు.

అడ్డుకోవాల్సిన అధికారులు కళ్లుమూసుకోవడంతో బొమ్మకల్ మల్ల చెరువు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. భూముల ధరలకు రెక్కలు రావడంతో ప్రభుత్వ భూములతో పాటు చెరువులపై కొందరు అక్రమార్కులు కన్నేసి యథేచ్ఛగా కబ్జాలు చేస్తు నిర్మాణాలు చేపడుతున్నారు. అందిన కాడికి దండుకుని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులకు ఫిర్యాదులందుతున్నా... పట్టించుకోకపోవడం... అలసత్వం ప్రదర్శిస్తుండడంతో కోట్ల విలువచేసి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాయమవుతున్న మల్ల చెరువు

కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న బోమ్మకల్ మల్ల చెరువును ఆక్రమణదారులు చెరబట్టారు. బొమ్మకల్ గ్రామం జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉండటంతో ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగింది. దీంతో ఆక్రమణదారుల దృష్టి చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ భూముల‌పై పడి చెర బడుతున్నారు. ఇప్పటికే గోపాల్ చెరువును మాయం చేసిన అక్రమార్కులు.. మల్ల చెరువును కూడా మాయం చేసేందుకు వ్యూహం పన్నుతున్నారు. చెరువు శిఖం భూమి ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో మట్టిపోసి ఎత్తు పెంచి నిర్మాణం చేపట్టారు. అడ్డుకోవాల్సిన అధికారులు ఆ పని చేయకపోవడంతో స్థానికులు అడ్డుకుని కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. నిర్మాణాన్ని తొలగించాల్సిన అధికారులు నిర్మాణ పనులను ఆపి చేతులు దులుపుకోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎక్సాల్ పట్టాలతో మల్ల చెరువుకు ఎసరు

బొమ్మకల్ గ్రామ శివారులో 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మల్లచెరువు కాల క్రమేణ దాని విస్తీర్ణం అక్రమణకు గురై ఇప్పుడు 40 ఎకరాలకు కుదించబడింది. అయితే చెరువు అక్రమణలకు గురికావడంలో అధికారుల పాత్ర ప్రధానమైనదనే ఆరోపణలు లేకపోలేదు. చెరువు విస్తీర్ణాన్ని కొలిచి హద్దులు నిర్ణయించాల్సిన అధికారులు చెరువు హద్దులు నిర్ణయించకపోవడంతో ఆక్రమణదారులు యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. అయితే అందులో అధికారుల పాత్ర కీలకంగా మారింది.

అప్పుడున్న ప్రభుత్వాలు ఇచ్చిన అధికారలతో అక్రమణలకు తెరలేపిన అధికారులు ఎక్సాల్ పట్టాల పేరుతో భూమిని యధేచ్ఛగా మార్కెట్లో పంచేశారు. నిబంధనల ప్రకారం భూమిని యథాస్థితిలో ఉంచాల్సిన పట్టాదారులు ఆ భూమిని మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు అడ్డదారుల్లో ముడుపులు తీసుకుంటూ చేతులు ముడుసుకోవడంతో ఆక్రమణదారులు ఆ భూములను కబ్జాలు చేస్తూ కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో బొమ్మకల్ మల్ల చెరువు మాయమైపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆక్రమణలను అరికడతాం.. రాజు, కరీంనగర్ రూరల్ తహసీల్దార్

కరీంనగర్ రూరల్ మండలం బోమ్మకల్ గ్రామం లోని మల్లచెరువులో అక్రమ నిర్మాణం చేపట్టినట్టు మా దృష్టికి వచ్చింది. మా దగ్గర సిబ్బంది కొరత.. పని ఒత్తిడి ఉండి స్థానిక గ్రామ పంచాయితి సిబ్బందికి సమాచారం ఇచ్చి పనులను ఆపివేశాం. త్వరలో పూర్తి సమాచారం సేకరించి తగుచర్యలు చేపడతాం. అక్రమంగా ఎవరైనా ప్రభుత్వభూములను ఆక్రమించుకున్నా వదిలిపెట్టే ప్రసక్తిలేదు. ఖచ్చితంగా చర్యలు చేపడుతాం.


Similar News