తెలంగాణలో ఫస్ట్ టైమ్ ఎన్నికల బరిలోకి జనసేన.. బీజేపీతో కలిసి పోటీ

తెలంగాణలో ఫస్ట్ టైమ్ జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతున్నది. మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీకి రంగం సిద్ధమైంది. బీజేపీతో ఎన్నికల పొత్తు కుదరడంతో ఈ స్థానాలు

Update: 2023-11-05 03:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఫస్ట్ టైమ్ జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతున్నది. మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీకి రంగం సిద్ధమైంది. బీజేపీతో ఎన్నికల పొత్తు కుదరడంతో ఈ స్థానాలు ఖరారయ్యాయి. తొలుత 32 చోట్ల పోటీ చేయాలని భావించినా శనివారం రాత్రి పొద్దుపోయే వరకు కిషన్‌రెడ్డితో పవన్ కల్యాణ్ జరిపిన చర్చల అనంతరం ఈ స్పష్టత ఏర్పడింది.

ఖమ్మం జిల్లాలో నాలుగు చోట్ల, గ్రేటర్ పరిధిలో రెండు చోట్ల, నల్లగొండ జిల్లాలో ఒక చోట, నాగర్‌కర్నూల్ జిల్లాలో మరో చోట్ల పోటీ చేసేలా రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఆ ప్రకారం ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, కోదాడ, నాగర్‌కర్నూల్ స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు ప్రాథమిక సమాచారం. అధికారికంగా రెండు పార్టీలూ ప్రకటన వెలువరించాల్సి ఉన్నది.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పోటీ చేయాలని భావించినా బీజేపీ నేత అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరి నిమిషంలో దానికి బదులుగా మల్కాజిగిరిలో పోటీ చేసేలా బీజేపీ ఆఫర్ ఇచ్చింది. దీనిపై జనసేన నుంచి స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీకి తగిన బలం లేని నియోజకవర్గాల్లో జనసేనను నిలబెట్టే ఫార్ములా ప్రకారం సీట్ల సర్దుబాటు జరిగినట్లు తెలుస్తున్నది.

జనసేనకు ఉన్న బలాన్ని అనుకూలంగా మల్చుకునేలా సీట్ల కేటాయింపు చేసినట్లు తెలిసింది. జనసేన అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పాల్గొననున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడంతో ఈ నెల 7న సిటీలో జరిగే ప్రధాని మోడీ బహిరంగసభలో పాల్గొనాల్సిందిగా పవన్ కల్యాణ్‌కు కిషన్‌రెడ్డి ఆహ్వానం పలికారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.

జనసేన పోటీపై సందేహాలు..

బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయంలో జనసేనకు భిన్నాభిప్రాయం లేకపోయినప్పటికీ ఆ బంధాన్ని ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం చేసి తెలంగాణలో పోటీకి దూరంగా ఉండే అవకాశాలు లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరి నిమిషం వరకూ జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, అధికారికంగా ఎలాంటి ప్రకటన చేస్తుందోననే సందేహాలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు పలికిన ఫార్ములానే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనుసరించాలన్న ప్రతిపాదనలు జనసేన నేతలు చేసినట్లు తెలిసింది.

కిషన్‌రెడ్డితో జరిగిన భేటీ అనంతరం పవన్ కల్యాణ్ పేరుతో జనసేన విడుదల చేసిన ప్రకటనతో సందేహాలు తెరపైకి వచ్చాయి. తొలుత తాము తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించామని, ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా బీజేపీతో చర్చించామని, ఇంకా ఆ చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నది. బీజేపీతో కలిసి పోటీ చేయాలని భావించినా రెండు సీట్ల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని వివరించింది. మరోసారి చర్చిస్తామని, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని సమన్వయం చేస్తున్నారని ఆ ప్రకటనలో వెల్లడించింది.

అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడితో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. అరెస్టు తర్వాత ఒకటిన్నర నెల రోజులకు పైగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబునాయుడిని గతంలో ములాఖత్ ద్వారా కలిసిన పవన్ కల్యాణ్ తాజాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో ఇంటికి వెళ్లి పరామర్శించారు. చంద్రబాబుతో భేటీ తర్వాత కిషన్‌రెడ్డితో సమావేశం జరగడం గమనార్హం.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..