సొంత నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌కు దళిత బంధు సెగ
దళిత బంధు కోసం మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దళిత బంధు మంజూరు చేయాలని ఆందోళన చేపట్టారు. మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీలో నివాసముంటున్న వారికి దళిత బంధు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.
అంబేడ్కర్ విగ్రహం ఎదుట నల్లటి వస్త్రాన్ని ముఖానికి కట్టుకుని ఆందోళన చేపట్టారు. ఓట్లు దండుకునేందుకే దళిత బంధు అని మండిపడ్డారు. ఈ పథకం ప్రవేశ పెట్టి తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో కొద్ది మందికి మాత్రమే యూనిట్లు ఇస్తున్నారన్నారు. ఎల్లారెడ్డి పేట దళితులు మీకు ఓట్లు వేయలేదా? ఓట్లు వేయనిదే మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారా అని కేటీఆర్‌ను వారు ప్రశ్నించారు. ఇదే ఎల్లారెడ్డి పేట మండలంలోనీ పదిర గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధు కింద ఎంపిక చేసి వారికి దళిత బంధు ఇచ్చారన్నారు.
వారు మాత్రమే మీరు ప్రవేశపెట్టిన దళిత బంధుకు అర్హులా? అని ఫైర్ అయ్యారు. మేము అర్హులం కాదా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. జిల్లా అధ్యక్షుడి గ్రామంలోనే దళిత బంధుకు దిక్కు లేదని మండిపడ్డారు. ఇక్కడి దళితులు బాగుపడితే ఓర్వలేకనే దళిత బంధు రాకుండా చేశారా అని మండిపడ్డారు. పదిర గ్రామాన్ని ఎందుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, వార్డు సభ్యులు ఎర్పుల శ్రీనివాస్, అందే వీరయ్య, బక్కి రవి, బద్ది దేవరాజు, మస్కురి దేవయ్య, ఏర్పుల తిరుపతి, బక్కి ఎల్లయ్యతో, తదితరులు పాల్గొన్నారు.