ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన టీ.కాంగ్రెస్.. ఆ కుటుంబానికి ఏకంగా 3 సీట్లు..!
కాంగ్రెస్ పార్టీలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఎంపికపై దుమారం రేగుతున్నది. తమ అభిప్రాయాలకు భిన్నంగా అభ్యర్థిని ఎంపిక చేశారని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఎంపికపై దుమారం రేగుతున్నది. తమ అభిప్రాయాలకు భిన్నంగా అభ్యర్థిని ఎంపిక చేశారని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది. స్థానికంగా పెద్ద సంఖ్యలో ఉన్న మాదిగలకు టికెట్ ఇవ్వకపోవడంతో గుర్రుగా ఉన్నట్టు సమాచారం. దీనితో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎమ్మెల్యేలు సహకరిస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి లోకసభ సీటును చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కొడుకు వంశీకృష్ణకు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు సీటు ఇవ్వడం పట్ల లోకసభ పరిధిలోని మెజారిటీ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారనే టాక్ ఉంది.
పెదవి విరుస్తోన్న ఎమ్మెల్యేలు
వంశీకృష్ణకు ఎంపీ టికెట్ ఇవ్వడంపై పెద్దపల్లి పరిధిలోని మెజారిటీ ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నారు. మొన్నటివరకు కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోసిన వివేక్ ఫ్యామిలీకి టికెట్ ఇవ్వడం ఏంటీ? అని ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని టికెట్ కేటాయించడం సరికాదని అభ్యంతరం చెపుతున్నారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక సమయంలో అధిష్టానం ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంది. మెజార్టీ ఎమ్మెల్యేలు వంశీ పేరును సూచించకుండా, స్థానికంగా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన లీడర్లకు టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ అధిష్టానం వంశీ పేరును ఖరారు చేయడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి లోకసభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్ గెలిచింది. అయితే, వంశీకి సపోర్టుగా కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, అందులో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ (తండ్రి), బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ (పెదనాన్న) మాత్రమే ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. మొదట్లో వంశీ అభ్యర్థిత్వాన్ని పెదనాన్న వినోద్ కూడా వ్యతిరేకించినట్టు ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఆయన మనసు మార్చుకుని సపోర్టుగా నిలిచినట్టు టాక్.
పార్టీ మారిన వ్యక్తులకు ప్రయారిటీనా?
వివేక్ రాజకీయ జీవితంపై మళ్లీ చర్చ జరుగుతున్నది. ఆయనకు రాజకీయ స్థిరత్వం లేదని కాంగ్రెస్ నేతలు ఇంటర్నల్ మీటింగ్స్‌లో విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు వివేక్ బీజేపీలో ఉండి, చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ లో ఎంపీగా గెలిచిన వివేక్ ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చి 2014లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరారు. కానీ 2019 లోకసభ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ పార్టీలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఇన్నిసార్లు పార్టీలు మారిన వివేక్ కుటుంబానికి ఎంపీ టికెట్ ఎలా ఇస్తారని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.
వివేక్‌కు కష్టాలు
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌కు పెద్దపల్లి ఎలక్షన్ వ్యక్తిగతంగా చాలెంజ్‌గా మారింది. కొడుకుకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. దీనితో టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం ముందుగా వ్యతిరేకించినట్టు చర్చ జరిగింది. కానీ ఎన్నికల్లో పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చుతాననే హామీ మేరకు హైకమాండ్ టికెట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే అటు అధిష్టానాన్ని, ఇటు పీసీసీ నేతలను మచ్చిక చేసుకునేందుకు అష్టకష్టాలు పడ్డ వివేక్‌కు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వస్తున్నది. పెద్దపల్లి పరిధిలోని చాలా మంది ఎమ్మెల్యేలతో వివేక్‌కు గతం నుంచే విబేధాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఎన్నికల సమయంలో వాటన్నిటిని పక్కన పెట్టి, వివేక్ కొడుకు గెలుపు కోసం సదరు ఎమ్మెల్యేలు పనిచేస్తారా? అని చర్చ జరుగుతున్నది. పైకి వంశీ గెలుపు కోసం సహకరిస్తామని చెపుతూనే, ఇంటర్నల్‌గా మాత్రం గెలుపు కష్టం అని కామెంట్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయం గ్రహించిన వివేక్ తన కొడుకు, అన్నతో కలిసి ప్రతి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి సహకరించాలని వేడుకుంటున్నారు.
రాజకీయ అనుభవం లేని వంశీ
గడ్డం వంశీకి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, ఏనాడు కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనలేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కేవలం లాబీయింగ్‌తో టికెట్ దక్కించుకుంటే, తాము ఎందుకు సపోర్టు చేయాలని ప్రశ్నిస్తున్నారు. మొన్నటివరకు ఆయనకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేదని విమర్శిస్తున్నారు. విదేశాల్లో చదువు పూర్తయిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన వంశీ కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్నారు. పెద్దపల్లిలోని లోకల్ లీడర్లతోనూ ఆయనకు పరిచయాలు లేవని, ఆయన గెలుపు కోసం తమ కేడర్ ఎందుకు పనిచేస్తుందని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వంశీకృష్ణ మాలవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మాదిగ ఓటర్ల సపోర్టు దొరకడం కష్టం అనే టాక్ ఉంది.