ఎల్బీనగర్ ఈస్ట్ జోన్ సర్కిల్ 3లో అక్రమ నిర్మాణాల జోరు

Update: 2022-08-31 14:48 GMT

దిశ, ఎల్బీనగర్ : అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు.. అనుమతి లేని నిర్మాణాల‌ను ఉపేక్షించేది లేదు.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేప‌డితే కూల్చివేస్తామంటూ అధికారులు, ఉన్నతాధికారులు నిత్యం చెప్పే మాట‌లు నీటి మూట‌లుగానే మిగిలిపోతున్నాయి. కొంద‌రు టౌన్‌ ప్లానింగ్ అధికారుల వ్యవ‌హారం ఉన్నతాధికారుల‌కు త‌ల‌నొప్పిగా మారింది. అక్రమార్కుల‌తో టౌన్ ప్లానింగ్ అధికారులు కుమ్మకై ల‌క్షల‌కు ల‌క్షలు దండుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణం అని ముందే తెలిసినా ప‌ట్టించుకోని టౌన్‌ ప్లానింగ్ అధికారులు భ‌వ‌నం ఐదు అంతుస్తుల ఎత్తుకు లేవ‌గానే అక్కడ వాలిపోతూ.. అక్రమ నిర్మాణం అంటూ చెప్పి భ‌వ‌న య‌జ‌మానుల‌తో కుమ్మక్కు అవుతున్నార‌నే విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. దీంతో య‌జ‌మానుల‌తో ఒప్పందానికి వ‌చ్చి పేరుకు మాత్రమే తూ..తూ మంత్రంగా కూల్చివేత‌లు చేప‌ట్టి చేతులు దులుపుకుంటున్నార‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కూల్చివేత‌లు చేప‌ట్టిన భ‌వ‌నాల‌కు సైతం మ‌ర‌మ్మతులు చేప‌ట్టి నిర్మాణాల‌ను పూర్తి చేసుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ఉన్నతాధికారుల‌కు కూల్చివేత‌లు చేప‌ట్టిన‌ట్లు మ‌స్కా కొడుతున్నారు. దీంతో ఎల్బీన‌గ‌ర్ ప‌రిధిలో అక్రమ నిర్మాణాల‌కు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. టాస్క్ ఫోర్స టీం ఈ అవినీతిపై దృష్టి సాధించాలని పలువురు కోరుతున్నారు.

అక్రమ నిర్మాణం వివరాలు

హయత్ నగర్ మండలం, సర్వేనెంబర్ 275, 276 , 290. ప్లాట్ నెంబర్ : 2 భాగ్యలత కాలనీ, హయత్ నగర్ డివిజన్ భాగ్యలత మెయిన్ రోడ్డు ఆనుకుని భారీ బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు ఓ నిర్మాణదారుడు. దానిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలనే నెపంతో నిర్మాణం మొదలుపెట్టాడు. ఆ నిర్మాణదారుడు ఒక పేరుమోసిన డాక్టర్. మొదట నిర్మాణ అనుమతులు తీసుకోవడానికి డ్రాయింగ్‌లో పోలి క్లినిక్ అని చూపించారు. ఆ తర్వాత రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని దానిపై టౌన్ ప్లానింగ్ అధికారులకు ముడుపులు చెల్లించి కమర్షియల్ నిర్మాణానికి టీడీఆర్ అదనపు ఫ్లోర్లను అన్వయించుకుని ఎన్నో తప్పిదాలకు పాల్పడుతున్నాడు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చుట్టు పక్కల స్థలం వదలకుండా లోతైన సెల్లార్ తవ్వి, అదనపు ఫ్లోర్ వేస్తూ అక్రమ పద్ధతిలో నిర్మాణం చేపడుతున్నాడు. రక్షణ చర్యలు పాటించకపోతే హాస్పిటల్ పర్మిషన్ ఇవ్వరు. ఫైర్ ఎన్ఓసీలు పోలీస్ ఎన్ఓసీలు ఇవ్వరు. తెలంగాణ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ డీఎంహెచ్ఓ పర్మిషన్లు ఎలా ఇస్తారో వేచి చూడాలి మరి..? ఇలా తప్పిదాలు చేస్తున్నారని స్థానికులు, సామాజిక కార్యకర్తలు రాతపూర్వకంగా ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో ఫిర్యాదులు సైతం చేశారు. ఇవ్వి ఇచ్చి మూడు నెలలు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అధికారులు చీకటి ఒప్పందాలు ఏమైనా చేసుకున్నారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అవినీతిపై ఎస్టీఎఫ్ టీం, నిఘా విభాగాలు దృష్టి సారించాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.


Similar News