కొత్త సెక్రటేరియట్ మెయింటెనెన్స్ నెల ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
కొత్త సెక్రటేరియట్ మెయింటెనెన్స్ సర్కారుకు సవాలుగా మారింది.
దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త సెక్రటేరియట్ మెయింటెనెన్స్ సర్కారుకు సవాలుగా మారింది. దీంతో నిర్వహణ బాధ్యతలను వేర్వేరు సంస్థలకు కాకుండా ఒకే సంస్థకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రతి రోజు సుమారు 250మందికి పైగా సిబ్బంది పని చేయాల్సి ఉంటుందని భావిస్తున్నది. హౌజ్ కీపింగ్, రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల సుమారు రూ. అర కోటి వరకు ఖర్చు కావచ్చని అంచనా వేసినట్లు సమాచారం.
హౌజ్ కీపింగ్ కోసమే 200 మంది
సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన సెక్రటేరియట్‌ను శుభ్రంగా ఉంచడం పెద్ద టాస్కే. మంత్రులు, అధికారుల వద్దకు పెద్ద ఎత్తున విజిటర్స్ వస్తూ పోతూ ఉంటారు. లిఫ్ట్స్, కారిడార్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే ఉండాలి. ఎక్కడ కూడా చెత్తా చెదారం కనిపించకుండా ప్రతి రెండు, మూడు గంటలకోసారి క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సుమారు 200 మంది పనిచేయాల్సి ఉంటుందని ఆఫీసర్లు అంచనా వేసినట్టు తెలిసింది.
మొన్నటి వరకు బీఆర్కే బిల్డింగ్‌లో హౌజ్ కీపింగ్ కోసం సుమారు 80 మంది పనిచేశారు. కానీ ఇక్కడ రెండింతల కంటే ఎక్కువ మంది అవసరం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఎలక్ట్రికల్, సివిల్ వర్క్స్, ఫర్నీచర్ వర్క్స్ కోసం మరో 50 మంది అవసరమవుతారని లెక్కలు వేసినట్టు తెలిసింది. ఇందుకోసం ప్రతి నెల సుమారు రూ. అర కోటి ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు సమాచారం.
మెయింటెనెన్స్ బాధ్యతలు ఐటీ ఫెడరేషన్‌కు..?
ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిన నిర్వహణ పనులను ఓ ప్రైవేటు ఏజెన్సీ చూసుకుంటున్నది. అయితే వచ్చే రెండు, మూడు వారాల్లో కొత్త సంస్థకు మెయింటెనెన్స్ బాధ్యతలను అప్పగించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. అందుకోసం సిటీలోని ఐటీ కంపెనీలకు సేవలు అందిస్తున్న ఐటీ ఫెడరేషన్‌ను సంప్రదిస్తున్నట్టు తెలిసింది. ఐటీ కంపెనీలు హౌజ్ కీపింగ్, ఎలక్ట్రికల్, సివిల్, ఫర్నీచర్ వర్క్స్ ఇలా అన్నింటినీ ఒకే సంస్థకు ఇస్తుంటాయి. అదే తరహాలో సెక్రటేరియట్ మెయింటెనెన్స్‌ను కూడా అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
హెచ్‌ఎండీఏకు లాన్ మెయింటెనెన్స్ బాధ్యతలు
సెక్రటేరియట్ బయట నిర్మించిన లాన్, అలాగే చుట్టూ ఏర్పాటు చేసిన గ్రీనరీ మెయింటెనెన్స్ బాధ్యతలను హెచ్ఎండీఏకు అప్పగించారు. బయట ఏర్పాటు చేసిన రెండు వాటర్ ఫౌంటేన్ల బాధ్యతలు కూడా హెచ్ఎండీఏకే ఇచ్చారు. ఇందుకోసం హెచ్ఎండీఏ ప్రతి రోజు 15 మంది సిబ్బందితో పనులు చేయిస్తున్నట్టు సమాచారం.
Also Read..
నాలుగు నెలల్లో రూ.1000 కోట్లు.. పార్టీని పాపులర్ చేసేందుకు సీఎం KCR బిగ్ స్కెచ్!