తరుగు తీస్తే తాట తీయండి.. రైతులకు మాజీ మంత్రి జూపల్లి పిలుపు..
వరి ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తే తాట తీయాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు పిలుపునిచ్చారు.
దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: వరి ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తే తాట తీయాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు పిలుపునిచ్చారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున తరలివచ్చిన రైతులతో కలిసి మాజీమంత్రి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అష్ట కష్టాలు పడి రైతులు పంటలు పండిస్తే అకాల వర్షాలు దెబ్బతీశాయి. ఇది చాలదు అన్నట్లుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తాలు పేరుతో క్వింటాలుకు కిలోల కొద్దీ తరుగుతీస్తున్నారని జూపల్లి ఆరోపించారు. రైతు ప్రభుత్వం అంటే ఈ పాలకులు రైతులను నట్టేట ముంచుతున్నారని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు ప్రభుత్వం చేరువ కావడానికి చిన్న జిల్లాలు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పారు.. కూత వేస్తే చాలు రైతులు, ప్రజల సమస్యలు ఇట్టే పరిష్కారం అవుతాయి అన్నారు.
పరిపాలన కోసం పెద్ద పెద్ద బంగ్లాలు కట్టారు.. ఇవి అన్ని దేనికోసం.. రైతులను, బీదలను దోచుకోవడానికేనా ..? అని జూపల్లి ప్రశ్నించారు. అవినీతి అధికారుల్లారా.. మీకు జీతాలు సరిపోడం లేదంటే తల ఇంత దానం చేస్తాం.. బిక్షాటన చేసుకోెండని జూపల్లి అన్నారు.. రైతుల మేలు చూడని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత.. పోతే ఎంత అన్నారు. ఈ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులకు న్యాయం చేయలేని పరిస్థితిలో సిగ్గు లేకుండా తమ పదవుల్లో కొనసాగుతున్నారు.. ఈ మోసపూరిత ప్రభుత్వంలో మీ కష్టాన్ని దోచుకునేలా వరి ధాన్యం తరుగు తీసే వారి గల్ల పట్టి నిలదీయండి అని జూపల్లి పిలుపునిచ్చారు. ప్రతి క్వింటా నుంచి నాలుగు నుంచి ఐదు కిలోలు తరుగు తీసి రైతులను మోసగించారని అట్టి డబ్బులు తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
ధర్నా చేస్తున్న జిల్లా కలెక్టర్ స్పందించకుండా వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రైతులు కల్లాలలోనే కష్టపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు జరిపేందుకు వీడియో కాన్ఫరెన్స్ లు జరుపుతుందని ఏది ముఖ్యమో తెలుసుకోవాలన్నారు. కలెక్టర్ స్పందించకపోవడంతో వెంటనే కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లారు. అక్కడ పోలీసులు ప్రతిఘటించి వారిని అడ్డుకోవడంతో ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొద్దిసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టర్ స్పందించేదాకా వెనక్కి తగ్గమని బీష్మీంచుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారి అభిమానులను రైతులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. జూపల్లి కృష్ణారావు అరెస్ట్ చేయడంతో అభిమానులంతా పోలీస్ వాహనానికి అడ్డు తగిలారు. దీంతో కొద్దిసేపు నాటకీయ పరిణామాల నేపథ్యంలో జూపల్లిని అరెస్ట్ చేసి తెలకపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.