కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎవరో నాకు తెలియదు: KA పాల్
తెలంగాణలో పొత్తులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పొత్తులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో తనకు తెలియదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ ఉపఎన్నికలో మూడు లక్షల ఓట్లు ఉంటే.. మూడు వేల ఓట్లు పడ్డాయని.. ఇక భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవదనే విషయం అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.
అంతేకాకుండా అసలు బీజేపీ పార్టీ తెలంగాణలో ఎక్కడ లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తుడుచుకుపోయిందని.. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నాడన్నారు. ఇప్పుడున్న పార్టీలన్నీ రెండు మూడు కుటుంబాలకు.. ఆయా కులాలకే పరిమితం అయ్యాయని పాల్ ఆరోపించారు. తాను దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని.. 90 శాతం ప్రజలు నాకు సపోర్ట్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ఇక, తెలంగాణ నూతన సచివాలయాన్ని అంబేద్కర్ పుట్టిన రోజునే ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు.