రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో హైడ్రామా
ఢిల్లీ పర్యటనను ముగించుకుని రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ పర్యటనను ముగించుకుని రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరారు. ప్రత్యేక విమానంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు థాక్రేతో పాటు రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ కు బయలుదేరింది. అంతకు ముందు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో హైడ్రామా నెలకొంది. ముఖ్యమంత్రిగా తన పేరు ఖరారు చేయడంతో నిన్న ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఇవాళ ఏఐసీసీ నేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలను కలిసి ధన్యవాదాలు తెలిపారు. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి వచ్చేందుకు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న రేవంత్ రెడ్డిని అధిష్టానం మళ్లీ వెనక్కి పిలిచింది. దీంతో ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి మళ్లీ వెనక్కి వెళ్లారు. అక్కడ మహారాష్ట్ర సదన్ లో మాణిక్ రావు థాక్రేతో భేటీ అయ్యారు. హైదరాబాద్ కు బయలుదేరిన రేవంత్ రెడ్డిని హైకమాండ్ ఆకస్మికంగా పిలవడం వెనుక ఏం జరిగిందనే చర్చ ఉత్కంఠగా మారింది.
తెగని మంత్రి పదవులు లెక్క:
ఎయిర్ పోర్ట్ నుంచి వెనక్కి వెళ్లిన రేవంత్ రెడ్డి మాణిక్ రావు థాక్రేతో భేటీ కాగా రేవంత్ తో పాటు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబు, బలరాం నాయక్ భేటీ అయ్యారు. వీరంతా మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. రేపు రేవంత్ రెడ్డితో పాటు మరో మొత్తం ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ పలు మీడియా సంస్థల కథనం ప్రకారం మొత్తం 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ కూడా తొమ్మిది కావడంతో రేపు తొమ్మిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లాల వారీగా సమీకరణాల వారీగా లెక్కలు వేసుకుంటున్న అధిష్టానం తొలి విడతగా రేపు ఎవరి చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించాలో అనేదానిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.