HYDRA: కొనసాగుతోన్న ‘హైడ్రా’ ఆపరేషన్స్.. పబ్లిక్ నుంచి ప్రభుత్వం ఫీడ్‌‌బ్యాక్

హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేతల గురించి పబ్లిక్ ఫీడ్ బ్యాక్ ఎలా ఉంది?

Update: 2024-08-27 03:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేతల గురించి పబ్లిక్ ఫీడ్ బ్యాక్ ఎలా ఉంది.. పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటున్నారా.. లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారా? అని ప్రజల మనోగతంపై ప్రభుత్వం ఆరా తీస్తున్నది. అందుకోసం నిఘా వర్గాలు, పార్టీ కేడర్ ద్వారా సమాచారం సేకరిస్తున్నది. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తే మిగతా నగరాల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయాలనే ఉద్దేశ్యంలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది.

విస్తృత అభిప్రాయ సేకరణ

కొన్ని రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, నాలాలపై ఉన్న ఆక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. దీన్ని కొంత మంది విపక్ష పార్టీలకు చెందిన లీడర్లు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం రహస్య ఎజెండాతో కూల్చివేతలను కొనసాగిస్తున్నదని విమర్శిస్తున్నారు. అయితే సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు? కూల్చివేతలను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రధానంగా యూత్ ఏం మాట్లాడుకుంటున్నారు? పర్యవరణ వేత్తల ఫీడ్ బ్యాక్ ఎలా ఉంది? అని తెలుసుకునే పనిలో సీఎంఓ అధికారులు ఉన్నారు. అందుకోసం నిఘా వర్గాల నుంచి ఇన్పర్మేషన్ తో పాటు వివిధ పనుల కోసం మండల ఆఫీసులు, కలెక్టరేట్స్ కు వచ్చే ప్రజల నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలిసింది. అయితే మెజార్టీ మంది పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటున్నట్టు టాక్ ఉంది.

మంత్రులు, ఎమ్మెల్యేల ఆరా

తమ వద్దకు వివిధ పనుల కోసం వచ్చే ప్రజల వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు హైడ్రా కూల్చివేతల గురించి ప్రస్తావిస్తూ, వారి ఫీలింగ్ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మరిన్ని ఆక్రమ కట్టడాలను కూల్చివేయడం మంచిదేనా? అని ఆరా తీస్తున్నారు. అయితే చాలా మంది మాత్రం పేదల ఇళ్ల జోలికి మాత్రం వెళ్లొద్దని సూచిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ వాటిజోలికి వెళ్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని అభిప్రాయపడినట్టు సమాచారం. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తోపాటు మరికొన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న చెరువులపై అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో వాటిని కూల్చివేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరువాత యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.


Similar News