హైడ్రాకు 3500 మంది సిబ్బంది అవసరం

చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా(HYDRA)కు సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.

Update: 2024-09-14 17:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా(HYDRA)కు సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. చెరువులను కబ్జా చేస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టబోమని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే హైడ్రా పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకే అనుకున్న సర్కార్(Govt) డిమాండ్ నేపథ్యంలో రీజినల్ రింగ్ రోడ్డు(త్రిపుల్ ఆర్) వరకు విస్తరించాలనే యోచనలో ఉంది. అందులో భాగంగానే హైడ్రాకు 3500 మంది సిబ్బంది అవసరమని ప్రాథమిక అంచనా వేశారు. వీరిలో పోలీసు శాఖతోపాటు ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉండనున్నారు.

దీనికి సంబంధించిన కమిషనరేట్ సికింద్రాబాద్‌లోని హెరిటేజ్ భవన్ ఫైగా ప్యాలెస్‌లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు గ్రేటర్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో మూడు హైడ్రా రీజినల్ ఆఫీసులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగరానికి సంబంధించిన రీజినల్ కార్యాలయాన్ని బుద్ధభవన్‌లోనే ఏర్పాటు చేయనున్నారు. రాచకొండకు సంబంధించిన రీజినల్ కార్యాలయాన్ని మేడిపల్లి, సైబరాబాద్‌కు సంబంధించిన కార్యాలయాన్ని మాదాపూర్/శేరిలింగంపల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. పోలీసు స్టేషన్‌ను మాత్రం బుద్ధభవన్‌లోనే ఏర్పాటు చేస్తున్నారు.


Similar News