ఆస్కార్ వేదికమీద దుమ్మురేపిన ధూల్‌పేట్ బిడ్డ
తెలుగు సినిమా పాట ఇప్పుడు హాలీవుడ్ లోనూ మార్మోగుతున్నది. ప్రపంచ సినిమా వేదికపై సగర్వంగా తలెత్తుకుని నిలబడింది.
దిశ, శేరిలింగంపల్లి: తెలుగు సినిమా పాట ఇప్పుడు హాలీవుడ్ లోనూ మార్మోగుతున్నది. ప్రపంచ సినిమా వేదికపై సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ అవార్డు వరించింది. ఎక్కడ చూసినా నాటు.. నాటు పాడిన పాతబస్తీ పోరడు రాహుల్ సిప్లిగంజ్ జోషే కనిపిస్తున్నది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు రచయిత చంద్రబోస్ రాసిన నాటు.. నాటు.. పాటకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. దీన్ని గాయకులు రాహుల్ సింప్లిగంజ్, కాళభైరవ(కీరవాణి తనయుడు) పాడారు. సోమవారం ఉదయం జరిగిన ఆస్కార్ వేడుకలో బెస్ట్ స్టేట్ మూవీ సాంగ్ గా నాటు..నాటు పాట అవార్డును కైవసం చేసుకుంది. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అందుకోగా.. తాజాగా ఆస్కార్ ను కూడా గెలుచుకుని తెలుగు సినిమా సత్తాను చాటింది. ఆస్కార్ స్థాయికి చేరుకోవడంపై అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా నాటు.. నాటు.. పాటనే వినిపిస్తున్నది. ఆ పాటను పాడినది హైదరాబాద్ గల్లీ బాయ్. తన కృషి, పట్టుదలతో రాణిస్తూ.. గానంతో అందరిని అలరిస్తూ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు విశ్వవేదికపై తన గాన మాధుర్యానికి అవార్డు సైతం గెలుపొందాడు. ఆస్కార్ వేదికపైనా రాహుల్ లైవ్ లో పాడి అంతర్జాతీయ నటులనూ ఆకట్టుకున్నారు.
గిన్నెలపై కర్రలతో వాయిస్తుంటే..
హైదరాబాద్ పాతబస్తీలో 1989 ఆగస్టు 22న రాహుల్ సిప్లిగంజ్ పుట్టాడు. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి ఉండేది. స్కూల్ నుంచి ఇంటికి రాగానే గిన్నెలపై కర్రలతో వాయిస్తూ ఫోక్ సాంగ్స్ పాడేవాడు. ఇది చూసిన రాహుల్ తండ్రి తనకు తెలిసిన గజల్ సింగర్ పండిట్ విఠల్ రావు వద్ద సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఓ వైపు సంగీతం నేర్చుకుంటూనే తండ్రి బార్బర్ షాప్ లో కటింగ్ చేసేవాడు. సుమారు 7 ఏళ్లపాటు శిక్షణ తీసుకొని గజల్స్ పై పట్టు సాధించాడు. ఆ సమయంలోనే కోరస్ పాడే అవకాశాలు వచ్చాయి. తొలిసారిగా నాగచైతన్య తొలిసినిమా జోష్ లో కాలేజీ బుల్లోడా.. సాంగ్ పాడే చాన్స్ దక్కింది. ఆ పాటకి మంచి ఆదరణ వచ్చింది. అప్పటి వరకు తను పాడిన పాటలతో ఓ ఆల్బమ్ తయారు చేసుకుని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి వినిపించాడు. అది విన్న కీరవాణి దమ్ము సినిమాలో వాస్తు బాగుందే.. టైటిల్ సాంగ్ పాడే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఈగ సినిమాలో ఈగ.. ఈగ.. ఈగ, రచ్చ సినిమాలో సింగరేణి ఉంది..బొగ్గే పండింది, రంగస్థలం మూవీలో రంగా రంగా రంగస్థలానా, ఇస్మార్ట్ శంకర్ లో బోనాలు సాంగ్.. ఇలా పలు సినిమాల్లో సింగర్ గా రాహుల్ చాలా పాటలు పాడారు.
సొంతంగా ఆల్బమ్స్
రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్ లో గాయకుడిగా రాణిస్తూనే.. మరోవైపు సొంతంగా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా రూపొందించాడు. మంగమ్మ, పూర్ బాయ్, మాకి కిరికిరి, గల్లీ కా గణేశ్, దావత్.. ఇలా హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలకు తన జోష్ మిక్స్ చేసి రాహుల్ పాటలు కంపోజ్ చేశాడు. అవన్నీ తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. 2019లో తెలుగు బిగ్ బాస్ సీజన్-3లో పాల్గొని విన్నర్ గా నిలువడంతో రాహుల్ దశ మారిపోయింది. ఆతర్వాత యూత్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాగే పలు వివాదాల్లోనూ ఇరుక్కున్నాడు కూడా. రాహుల్ ప్రస్తుతం విశ్వవేదికపై తెలుగోడి సత్తా చాటాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ పాడగా.. అది ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. దీంతో పాతబస్తీ పోరడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నది. రాహుల్ సిప్లీ గంజ్ కు ‘దిశ’ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతుంది.