ఇక జీహెచ్ఎంసీకి అప్పులు పుట్టనట్టేనా?
మహానగరంలోని కోటిన్నర మందికి అత్యవసరమైన సేవలందించే జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయింది. సమైక్య పాలనలో మిగులు బడ్జెట్ తో ఉన్న జీహెచ్ఎంసీ స్వపరిపాలన సిద్దించిన తర్వాత 2015 నుంచి చేసిన అప్పులు
దిశ, సిటీ బ్యూరో: మహానగరంలోని కోటిన్నర మందికి అత్యవసరమైన సేవలందించే జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయింది. సమైక్య పాలనలో మిగులు బడ్జెట్ తో ఉన్న జీహెచ్ఎంసీ స్వపరిపాలన సిద్దించిన తర్వాత 2015 నుంచి చేసిన అప్పులు ప్రస్తుతం సుమారు రూ. 6 వేల కోట్లకు పేరుకుపోయాయి. ఈ మొత్తం అప్పులకు గాను ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ రూ. కోటి మినహా అస్సలు కట్టనేలేదు. ప్రతి నెల సుమారు రూ. 30 కోట్ల నుంచి రూ. 35 వేల కోట్ల వరకు వడ్డీనే చెల్లిస్తూ వస్తుంది. జీహెచ్ఎంసీకి ఉన్న ఆర్థిక వనరుల ప్రకారం అప్పులు తీసుకునే లిమిట్ దాటి పోయిందంటూ అధికారులు అప్పులడిగిన బ్యాంక్ లు తెగేసి చెబుతున్నారు. వర్షాకాలం ముంచుకొస్తున్నందున కనీసం ఈ వారి వర్షాకాలంలోనైనా మహానగరాన్ని ముంపు నుంచి రక్షించేందుకు ఎస్ఎన్ డీపీ పనులను పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికారులు ఇటీవలే బాండ్ల ద్వారా మరో రూ. 300 కోట్లను తీసుకువచ్చి, వెచ్చించారు. కానీ ఇంకా ముఖ్యమైన పనులు వివిధ దశల్లోనే ఆగిపోయాయి. వివిధ ప్రైవేటు ఆర్థిక సంస్థలు, బ్యాంక్ ల చుట్టూ అప్పల కోసం చక్కర్లు కొడుతున్నా, ఎక్కడా కూడా అప్పు పుట్టడం లేదని తెల్సింది. తాము వడ్డీ ఎక్కువ చెల్లిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నా, లిమిట్ దాటినందున తమకు రికవరీ కష్టతరమవుతుందని చెబుతూ, తిరిగి అప్పులిచ్చేందుకు పలు బ్యాంక్ లు, ప్రైవేటు ఆర్థిక సంస్థలు నిరాకరించినట్లు సమాచారం. వర్షాకాలం ముంచుకొస్తున్నా, ఎస్ఎన్ డీపీ పనులు చేసేందుకు ఎక్కడ అప్పులు పుట్టకపోవటం అధికారులకు తలనొప్పిగా మారగా, దీనికి తోడు మూలుగుతున్న నక్కపై తాటి కాయ పడినట్టుగా ఇప్పటి వరకు తీసుకున్న సుమారు రూ. 6 వేల కోట్లకు అస్సలు, వడ్డీతో కలిపి వచ్చే అక్టోబర్ నుంచి ఈఎంఐలు మొదలయ్యే అవకాశముండటంతో మున్ముందు జీహెచ్ఎంసీ జీతాలు, పెన్షన్లతో పాటు రొటీన్ మెయింటనెన్స్ గగనంగా మారి, ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉందంటూ కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెల్లించిన అస్సలు రూ. 40.50 కోట్లే
2016-17 వరకు ఎలాంటి అప్పుల్లేవని చెప్పుకొచ్చిన అధికారులు ఆ తర్వాత 2017-18లో హడ్కో నుంచి రూ. 100 కోట్లు 8.90 శాతం వడ్డీకి అప్పుగా తెచ్చినట్లు అధికారులు విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెచ్చిన అప్పులో రూ. 2.50 కోట్లను తిరిగి చెల్లించి మిగిలిన సొమ్ముకు 6.66 శాతం వడ్డీ చెల్లించారు. ఇదే సంవత్సరంలో మున్సిపల్ బాండ్లు ట్రెచ్-వన్ ద్వారా మరో రూ. 200 కోట్లను 8.90 శాతానికి అప్పుగా తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే సంవత్సరంలో మళ్లీ రూ. 10 కోట్ల అప్పును 9.34 శాతం వడ్డీతో తిరిగి చెల్లించారు. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం 2018-19లో హాడ్కో నుంచి తిరిగి రూ. 40 కోట్లను 9.90 శాతం వడ్డీకి అప్పు తెచ్చారు. మున్సిపల్ బాండ్లు ట్రెంచ్ -1 కు 8.90 శాతంగా రూ. 17.80 కోట్లను వడ్డీగా చెల్లించారు. ఇదే సంవత్సరం రూ.195 కోట్లను మున్సిపల్ బాండ్లు ట్రెంచ్ -2 ద్వారా అప్పుగా సమకూర్చుకున్న బల్దియా రూ. 9.38 వడ్డీ గా చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. మరుసటి ఆర్థిక సంవత్సరమైన 2019-20 నుంచి బల్దియా కు అప్పుల భారం పెరుగుతూ వచ్చింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు అప్పు తెచ్చిన బల్దియా అప్పటికే అప్పుగా తెచ్చిన మొత్తంలో కేవలం రెండు సార్లు రూ. 20 కోట్లు చొప్పున సుమారు రూ.42.50 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
బాండ్ల, టర్మ్ రూపే లోన్లు
2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. వంద కోట్లను 10.23 శాతం వడ్డీకి మున్సిపల్ బాండ్లు ట్రెంచ్ -3 ద్వారా సమకూర్చుకోగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) రూపీ టర్మ్ లోన్-1 కింద రూ. 622.60 కోట్లను 8.65 శాతం వడ్డీకి రుణంగా స్వీకరించింది. కానీ కేవలం రూ. 8.03 కోట్ల వడ్డీ చెల్లించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరుసటి ఆర్థిక సంవత్సరమైన 2020-21లో మరోసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) రూపీ టర్మ్ లోన్-1 కింద 7.70 శాతం వడ్డీకి రూ.654.07 కోట్లను లోన్ గా స్వీకరించి, కేవలం రూ. 76.60 కోట్లను మాత్రమే వడ్డీ చెల్లింపులు చేసింది. ఇదే సంవత్సరంలో ఎస్ బీఐ రూపీ టర్మ్ లోన్-2 కింద 621.18 కోట్లను 7.20 వడ్డీ శాతానికి రుణంగా తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ మొత్తం అప్పులపైనే ఆధారపడి కార్యకలాపాలను కొనసాగించింది. కాంట్రాక్టర్ల బిల్లులు, రొటీన్ మెయింటనెన్స్, జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులు వంటివి గగనంగా మారి, ఒక దశలో ఉద్యోగులు, కార్మికుల నుంచే గాక, కాంట్రాక్టర్ల నుంచి కూడా బకాయిల చెల్లింపుల కోసం నిరసన సెగ కూడా తగిలింది.
ఒక్క ఏడాదిలోనే రూ. 1912.93 కోట్ల అప్పులు
జీహెచ్ఎంసీ 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే అప్పులు ఎక్కువగా చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎస్ బీఐ రూపీ టర్మ్ లోన్-1,2,3లతో కలిపి హెచ్ఎండీఏ నుంచి తీసుకువచ్చిన అప్పులు కలిపితే మొత్తం రూ. 1912.93 కోట్లకు చేరాయి. ఎస్ బీఐ రూపీ టర్మ్ లోన్-1 కింద మరోసారి 7.70 శాతం వడ్డీకి రూ. 1223.33 కోట్లను అప్పుగా తెచ్చిన జీహెచ్ఎంసీ రూ. 144.27 కోట్లను వడ్డీగా చెల్లించినట్లు అధికారులిచ్చిన లెక్కలు తేల్చుతున్నాయి. ఇదే సంవత్సరం ఎస్ బీఐ రూపీ టర్మ్ లోన్-2 కింద మరోసారి సుమారు 7.20 శాతం వడ్డీకి గాను రూ. 279.60 కోట్లను లోన్ గా తీసుకుని, రూ.54.80 కోట్లను ఇప్పటి వరకు తీసుకున్న అప్పులకు వడ్డీగామాత్రమే చెల్లించగా, అసలేమీ చెల్లించలేదంటే జీహెచ్ఎంసీ ఆర్థికంగా ఎంత క్షీణించిపొయిందో అంచనా వేసుకోవచ్చు. మరోసారి ఎస్ బీఐ రూపీ టర్మ్ లోన్-3 కింద 7.05 శాతం వడ్డీకి గాను రూ. 110 కోట్లను లోన్ గా తెచ్చుకుంది. అప్పటి వరకు పేరుకుపోయిన వడ్డీలో కేవలం రూ. 2 లక్షలు మాత్రమే చెల్లించింది. ఇక 2021-22లో చిట్టచివరి సారిగా ఎలాంటి వడ్డీ లేకుండా రూ. 300 కోట్లను హెచ్ఎండీఏ నుంచి అప్పుగా తెచ్చింది. ఇందులో నుంచి ఇప్పటి వరకు తెచ్చిన అప్పులకు వడ్డీని గానీ, అసలును గానీ చెల్లించకపోవటం, చివరి సారిగా ఎస్ఎన్ డీపీ పనుల కోసం చేసిన రూ. 300 కోట్లతో కలిపి అప్పులు సుమారు రూ. ఆరు వేల కోట్లకు చేరినట్లు సమాచారం. ఈ మొత్తం అప్పులో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ తిరిగి చెల్లించిన అసలు సొమ్ము కేవలం రూ. 42.50 కోట్లు కాగా, సుమారు రూ.795.40 కోట్లు కేవలం వడ్డీలుగానే చెల్లించింది. రోజూ వారీ వసూలవుతున్న నిర్మాణ అనుమతుల చార్జీలు, ఆస్తి పన్ను రొటీన్ కలెక్షన్లు రోజువారీ ఖర్చులు, మెయింటనెన్స్ కే సరిపోతుండగా, ఇక నెల ముగిసిందంటే జీతాలు, పెన్షన్లు ఎలా చెల్లించాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.