Breaking: పోలీసుల అదుపులో కేంద్రమంత్రి బండి సంజయ్
కేంద్రమంత్రి బండి సంజయ్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ..
దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహనంలో తీసుకెళ్లి నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద విడిచిపెట్టారు. అయితే బండి సంజయ్‌ను తీసుకెళ్తున్న క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల వాహనాన్ని గ్రూప్-1 అభ్యర్థులు(Group-1 candidates) అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా సరే అభ్యర్థులను చెదరగొడుతూ బండి సంజయ్‌ను వాహనంలో తరలించారు
కాగా గ్రూప్ -1 అభ్యర్థులు ఇవాళ చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ (RTC Cross Road)నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం(Ambedkar statue) వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే గ్రూప్- 1 అభ్యర్థులకు బండి సంజయ్ మద్దతు తెలిపారు. అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతూ ర్యాలీలో పాల్గొనే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను నేరుగా బీజేపీ స్టేట్ ఆఫీసుకు తీసుకెళ్లి అక్కడ వదిలేశారు. ఆఫీసు వద్ద పోలీసులు బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు.