గ్రేటర్‌లో పాన్ షాప్‌ల పై కొరవడిన నిఘా..

పేరుకే నిషేధం, అమ్మకాలు అంతా బహిరంగం. నగరంలో ఏ మూలకు వెళ్లినా, ఏ గల్లీలోకి చూసినా విచ్చలవిడిగా నిషేదిత జర్దా అమ్మకాలు కొనసాగుతున్నాయి.

Update: 2024-12-12 02:24 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : పేరుకే నిషేధం, అమ్మకాలు అంతా బహిరంగం. నగరంలో ఏ మూలకు వెళ్లినా, ఏ గల్లీలోకి చూసినా విచ్చలవిడిగా నిషేదిత జర్దా అమ్మకాలు కొనసాగుతున్నాయి. గుట్కా, ఇతర జర్ధ ఉత్పత్తుల కారణంగా ప్రజలు క్యాన్సర్ వంటి జబ్బుల భారిన పడుతుండడంతో ప్రభుత్వం జర్ధా, గుట్కా అమ్మకాలను నిషేదించింది. దీంతో వ్యాపారులు మరో రకంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. పాన్ మసాలా పై నిషేదం లేకపోవడంతో వీటిని బహిరంగంగా విక్రయిస్తూ గుట్కా కావాలని అడిగిన వారికి జర్థాతో కలిపి ఇస్తున్నారు. ఇలా అమ్మకాలు బహిరంగంగానే కొనసాగుతున్నా అధికారుల దాడులు లేకపోవడంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. నేడు నగర వ్యాప్తంగా జర్ధా అమ్మని పాన్ షాప్‌లు లేవంటే అతిశయోక్తి కాదు.

లాభాల కోసం అడ్డదారులు..

గ్రేటర్ హైదరాబాద్‌లోని పాన్ షాప్‌ల నిర్వాహకులు లాభాల కోసం ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపే జర్దా ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. గుట్కా, జర్ధా నిషేధానికి ముందు వ్యాపారులకు వీటి అమ్మకాల పై అంతంత మాత్రంగా లాభాలు వస్తుండగా ఇప్పుడు అవి రెట్టింపయ్యాయి. నిషేదాన్ని బూచిగా చూపించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఏ పాన్ షాప్‌లో చూసినా పాన్ బహార్, బాబా నవరతన్, ఆర్‌ఆర్ పాన్ మసాలా, 24 క్యారెట్స్, సాగర్ వంటి ఎన్నో రకాల పాన్ మసాలాలతో పాటు సూరజ్ జర్దా, అంబర్ ఖైనీ వంటి జర్ధా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. అనేక రకాల బ్రాండ్‌లను విక్రయిస్తూ అమాయకుల ప్రాణాలను నమిలేస్తున్న ఇలాంటి అనేక బ్రాండ్లు అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని చోట్లా యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇలా నగరంలో రోజుకు ఏకంగా రూ.100 కోట్ల పైగా లావాదేవీలు జరుగుతున్నా పోలీసులు కానీ, ఇతర అధికారులు కానీ దాడులు చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడో గుర్తొచ్చినట్లుగా పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ ఇది పూర్తి స్థాయిలో లేకపోవడంతో వ్యాపారులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందనే ఆరోపణలు వినబడుతున్నాయి.

జర్దా అమ్మకాలకు అడ్డాగా పాన్ షాప్‌లు..

డ్రగ్స్, ఇతర మాధకద్రవ్యాల విక్రయాల పై నగర పోలీస్ కమిషనర్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నగరాన్ని డ్రగ్స్ ఫ్రీగా మార్చేందుకు ప్రతినిత్యం వీటిని విక్రయించే వారి గుర్తించి కటకటాల్లోకి నెడుతున్నారు. పబ్‌లు, బార్లు, రెస్టారెంట్ల పై గతంలో లేని విధంగా ఆంక్షలు విధించారు. ఇలా డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాల అమ్మకాలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నప్పటికీ జర్ధా, గుట్కాలు విక్రయిస్తున్న పాన్ షాప్‌ల పై దృష్టిసారించడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. జర్ధా పై నిషేదం ఉన్నప్పటికీ నగరంలో దీనిని అమ్మని పాన్ షాప్ లేదంటే అతిశయోక్తి కాదు.

నిర్వీర్యమౌతున్న చట్టం..

హైదరాబాద్ మహానగరంలో ఆహార భద్రత, ప్రమాణాల చట్టం - 2006 నిర్వీర్యమౌతోంది. ఈ చట్టం ప్రకారం గుట్కా మసాలా తయారీ, పొగాకు, నికోటిన్, ఖైనీ, ఖారా వంటి ఉత్పత్తులనూ ప్రభుత్వం నిషేధించింది. ప్రజల ప్రాణాలను హరిస్తున్న వీటన్నింటినీ నిషేధిస్తూ 2009లో ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం వైఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ చట్టం అమలుకు నోచుకోకపోవడంతో నిత్యం కోట్లలో వ్యాపారం జరుగుతోంది. నగరం శివారు ప్రాంతాల్లో టన్నుల కొద్దీ పొగాకు పదార్థాలు తయారు చేయడం, ఆ ఉత్పత్తులు వందల సంఖ్యలో ఉన్న హోల్‌సేల్ వ్యాపారులకు, అక్కడి నుంచి వేలల్లో ఉన్న రిటైల్ వ్యాపారులకు చేరుతోంది. జర్ధా పై నిషేధం వ్యాపారులకు రెట్టింపు లాభాలు తెచ్చిపెడుతుండగా వినియోగదారుల ఒళ్లుతో పాటు జేబులను సైతం గుల్ల చేస్తోంది.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..

నగరంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న జర్ధా, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తుల విక్రయాల పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వీటికి అలవాటుపడిన యువత భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. నిషేధానికి పూర్వం ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం సమకూరేది. నిషేధం అనంతరం విక్రయాలు తగ్గకపోగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో భారీగా గండి పడుతోంది. ఇప్పటికైపా పొగాకు ఉత్పత్తుల విక్రయాల పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


Similar News