డేటా ఎంట్రీ ఆపరేటర్ల డిమాండ్.. నిలిచిన డేటా ఎంట్రీ పనులు
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలు నమోదు పై నీలినీడలు కమ్ముకున్నాయి.
దిశ, సిటీబ్యూరో: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలు నమోదు పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆపరేటర్లు మొరాయించడంతో ఎంట్రీ ప్రశ్నార్థకంగా మారింది. దీనికి ఎన్యుమరేటర్లకు పైసలివ్వకపోవడమే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే సర్వే చేసిన ఎన్యుమరేటర్లకు ఇంతవరకు పైసలివ్వలేదు..మాకేమిస్తారని పలువురు ఆపరేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఓ సర్కిల్‌లో 500 మందికి డేటా ఎంట్రీ లాగిన్ ఇస్తే 200 మంది మాత్రమే వస్తున్నారు. వీరిలో ఒక్కొరోజు సగం మంది కూడా రావడం లేదు. పై అధికారులు మాత్రం వివరాలు త్వరగా ఎంట్రీ చేయాలని ఆదేశాలిచ్చారు. ఆపరేటర్లను బతిమాడలేక, పై అధికారులకు సమాధానం చెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఎన్యుమరేటర్లకు పైసలేవి?
జీహెచ్ఎంసీ పరిధిలో 27,78,682, కంటోన్మెంట్ 50,000 మొత్తం కుటుంబాలు 28,28,682 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిని సర్వే చేయడానికి 19,283 మంది ఎన్యుమరేటర్లను నియమించుకున్నారు. వీరిని పర్యవేక్షించడానికి పది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్ చొప్పున 1800 మందిని నియమించుకున్నారు. అయితే ఒక్కో ఎన్యుమరేటర్‌కు రూ.10వేల చొప్పున, సూపర్‌వైజర్‌కు రూ.12వేల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే పూర్తయి 10 రోజులు గడుస్తున్న పైసలివ్వకపోవడంతో ఎన్యుమరేటర్లు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు అయితే కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులతో సర్వే చేయించారు. తమకు పైసలిప్పించాలని టీచర్లకు విద్యార్థులు ఫోన్లు చేస్తున్నారు. టీచర్లేమో జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్టర్‌కు రూ.28.. సబ్ కాంట్రాక్టర్‌కు రూ.14
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు వివరాలు నమోదు చేయడానికి ఒక్కో ఫామ్‌కు రూ.28 ఇవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. జోన్‌కు ఒకరిచొప్పున ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించింది. ఫామ్‌కు రూ.28 చొప్పున కాంట్రాక్టు ఏజెన్సీకి ఇవ్వనున్నారు. ఈ కాంట్రాక్టర్లు చిన్న చిన్న సంస్థలు, విద్యార్థులకు ఫామ్‌కు రూ.14 చొప్పున సబ్ కాంట్రాక్టుకు అప్పగించారు. అయితే కాంట్రాక్ట్ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ డబ్బులిచ్చేది ఎప్పుడు? కాంట్రాక్టర్లు తమకు ఎప్పుడిస్తారో అని చాలా మంది ఆపరేటర్లు ముందుకు రావడం లేదని ఆయా సర్కిళ్ల అధికారులు చెబుతున్నారు. ఆపరేటర్లు అందుబాటులో లేకపోవడంతో 40 శాతం మాత్రమే ఫారాలు డేటా ఎంట్రీ చేసినట్లు తెలిసింది.
ఈనెల 20 వరకు సర్వే..
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నవంబర్ 6వ తేదీన ప్రారంభమైన 30న ముగిసింది. తమ కుటుంబానికి సంబంధించిన వివరాలు సేకరించలేదని ఎవరైనా ఫిర్యాదు చేసినా, ఎన్యుమరేటర్లు వెళ్లని ప్రాంతాలే మైనా ఉంటే వాటిని ఈనెల 20 వరకు సర్వే చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీంతోపాటు ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 86.88శాతమే సర్వే పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌లో 28,28,682 కుటుంబాలు ఉన్నట్టు ప్రకటించిన జీహెచ్ఎంసీ 23.88 లక్షల కుటుంబాలను మాత్రమే సర్వే చేసినట్లు అధికారులు చెబుతున్నారు.