ట్రెసా ఒక వటవృక్షం లాంటిది... వంగ రవీందర్ రెడ్డి
ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం మూసారాంబాగ్ రెవెన్యూ భవన్ లో జరిగింది.
దిశ, శేరిలింగంపల్లి : ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం మూసారాంబాగ్ రెవెన్యూ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ తో సహా ఇతర కార్యవర్గ సభ్యులు, 33 జిల్లాల సీసీఎల్ఎ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లాల వారీగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం పై చర్చించారు. కొందరు సోషల్ మీడియా వేదిక ద్వారా ట్రెసా సంఘం పై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కోవాలని కార్యవర్గ సభ్యులు తీర్మానించారు. అనంతరం ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రెసా ఒక వటవృక్షం లాంటిదని, కొంత మంది వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న బృందాలు సంఘ పటిష్టతకు ఏ మాత్రం బలహీనపర్చలేవని, రెవెన్యూ ఉద్యోగులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ట్రెసా ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ మాట్లాడుతూ.. ఎందరో నాయకుల త్యాగాలకు రెవెన్యూ భవన్ సాక్షిగా నిలిచిందని, క్యాడర్ల వారిగా సంఘాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వం వద్ద పలుకుబడి కోల్పోయే ప్రమాదం ఉందని కాబట్టి అన్ని క్యాడర్లకు ఒకే సంఘంగా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతంలో అపరిష్కృతంగా మిగిలిపోయిన డిమాండ్లతో పాటు ప్రధాన సమస్యలపై రాష్ట్ర కార్యవర్గం చర్చించి పలు తీర్మానాలు ఆమోదించింది. అందులో ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జనవరిలో ఎన్నికల బదిలీలు చేపట్టాలని, అదేవిధంగా నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన నాయబ్ తహాశీల్దార్లను తిరిగి బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నాయబ్ తహశీల్దార్ పదోన్నతి పొందిన ఉద్యోగులకు సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఇవ్వాలని తీర్మానించారు.
రాష్ట్రంలో లగచర్ల, దిలావర్పూర్ లో రెవెన్యూ ఉద్యోగులపై జరిగిన దాడులు తీవ్రంగా ఖండిస్తూ, రెవెన్యూ ఉద్యోగులకు రక్షణకై ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఈ మధ్య కాలంలో రెవెన్యూ ఉద్యోగుల పై అకారణంగా, ఎటువంటి ఆధారాలు లేకుండా సహజ న్యాయ సూత్రాలు పాటించకుండా క్రిమినల్, ఎసిబి, విజిలెన్స్ కేసులు నమోదు చేస్తుండడం పట్ల సమావేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల వల్ల నిజామాబాద్ జిల్లాలో భయాందోళనతో ఒక ఉద్యోగి మరణించిన విషయం కార్యవర్గం దృష్టికి వచ్చింది. ఉద్యోగుల మనోస్థైర్యాన్ని కాపాడడానికి అవసరమైన న్యాయ సహాయం అందించడానికి సంఘం తరపున లీగల్ ఎయిడ్ అందించాలని తీర్మానించారు. కొత్తగా ఏర్పడిన మండలాలకు కేడర్ స్ట్రెంత్ మంజూరు చేయాలని తీర్మానించారు. ఈ సమావేశంలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షులు పి.రాజ్ కుమార్, ఎండీ రియాజుద్దీన్, ఉపాధ్యక్షులు సీఎల్ బి శాస్త్రి, బాణాల రాంరెడ్డి, కె.నిరంజన్ రావు, ఎండీ అన్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు దేశ్య, జగన్మోహన్ రెడ్డి, కో ఆర్డినేటర్ నారాయణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.