విపత్తుల నిర్వహణపై హైడ్రా ఫోకస్.. కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం

చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రోడ్లు, నాలా సంరక్షణే కాదు..విపత్తుల నిర్వహణ లక్ష్యంగా పనిచేయాలని హైడ్రా నిర్ణయించింది. ....

Update: 2024-12-01 17:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రోడ్లు, నాలా సంరక్షణే కాదు..విపత్తుల నిర్వహణా లక్ష్యంగా పనిచేయాలని హైడ్రా నిర్ణయించింది. ముఖ్యంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఏలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చేయాలంటే ప్రజలను అప్రమత్తం చేయడానికి ముందస్తు సమాచారం ఇవ్వడం ముఖ్యమైనది. అందుకు వాతావరణ శాఖ కీలకంగా పని చేయాల్సి ఉంటుంది. వాతావరణ మార్పుల్లో వర్ష సూచన, ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే ప్రదేశాలు, సమయాలపై బేగంపేట్ లోని డాప్లర్ వెదర్ రాడార్ సెంటర్ అందజేస్తోంది. కానీ ఈ సెంటర్ ద్వారా కచ్చితమైన సమాచారం రావడంలేదనే నగరవాసుల నుంచి విమర్శలులేకపోలేదు. వాతావరణ శాఖ సమాచారం తప్పుగా వస్తోందని పలుమార్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనంతటికి బేగంపేట్‌లోని సెంటర్ ద్వారా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, కొండప్రాంతాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వకపోవడమేనని హైడ్రా గుర్తించింది. దీన్ని అధిగమించడానికి వాతావరణ శాఖ అధికారులతో హైడ్రా అధికారులు చర్చించారు.

మరో డాప్లర్ వెదర్ రాడార్ సెంటర్

దేశంలోని ముఖ్యమైన నగరాల్లో రెండు కంటే ఎక్కువగానే డాప్లర్ వెదర్ రాడార్ సెంటర్లు ఉన్నాయి. ముంబయిలో నాలుగు, ఢిల్లీలో మూడు, బెంగుళూరులో రెండు సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో మాత్రం బేగంపేట్ లో ఒకటి మాత్రమే ఉంది. మరో సెంటర్ ఏర్పాటు చేయాలని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్‌తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. ఈ సెంటర్ ఏర్పాటు చేస్తే నగరవాసులకు ఏలాంటి ముప్పులేకుండా ముందస్తు సమాచారం ఇవ్వడానికి అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ సెంటర్ ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.100కోట్ల వరకు అవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిఉంది. నగరానికి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం డాప్లర్ వెదర్ రాడార్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.

రెయిన్ గేజ్‌లు పెంచాలని సూచన

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్ష పాతం లెక్కల కోసం వార్డుకోకటి చొప్పున 150తోపాటు మరో 50 కేంద్రాల్లో రెయిన్ గేజ్ లు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి? ఎన్ని పనిచేయడంలేదు? అనే సమాచారం కరువైంది. వీటికి మరమత్తులు చేయడంతోపాటు కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి వాతావరణ శాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

విపత్తుల నిర్వహణపై ఫోకస్

ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలో విపత్తుల నిర్వహణపై హైడ్రా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే బెంగుళూరులో విపత్తుల నిర్వహణపై హైడ్రా అధికారులు అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. నగరంలో 140 ప్రధాన వాటర్ లాగింగ్ కేంద్రాలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాలు, భారీ వర్షాల నేపథ్యంలో వచ్చే వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తున్నారు.


Similar News