పటాకులు విక్రయించేందుకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి..: జీహెచ్ఎంసీ కమిషనర్

బాణాసంచా (పటాకుల షాపులు) విక్రయ దుకాణదారులు తప్పనిసరిగా

Update: 2024-10-25 02:08 GMT

దిశ, సిటీబ్యూరో : బాణాసంచా (పటాకుల షాపులు) విక్రయ దుకాణదారులు తప్పనిసరిగా జీహెచ్ఎంసీ నుంచి తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని, లైసెన్స్ లేకుండా షాప్ నిర్వహించడానికి అనుమతి ఇవ్వబడదని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి స్పష్టం చేశారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు రిటైల్ షాపులకు రూ.11 వేలు, హోల్ సేల్ షాపులకు రూ.66 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. తాత్కాలిక ట్రేడ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కొరకు సిటిజన్ సర్వీస్ సెంటర్/ జీహెచ్ఎంసీ వెబ్‌సైట్/(www.ghmc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. బాణాసంచా షాపులను ఫుట్‌పాత్‌లు, జనావాసాల మధ్య ఏర్పాటు చేయరాదన్నారు.

కాలనీ, బస్తీలకు దూరంగా ఓపెన్ గ్రౌండ్‌లో/పెద్ద హాల్‌లో తగిన ఫైర్ సేఫ్టీతో షాపులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అగ్నిమాపక నిరోధక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దుకాణాలకు సమీపంలో బాణాసంచా కాల్చకూడదని, షాపులో నాణ్యమైన విద్యుత్ వైర్‌ను వినియోగించాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులను పాటించాలని సూచించారు. ఫైర్ క్రాకర్స్ అయిన సిరీస్ క్రాకర్స్/లడీస్ తయారీ, అమ్మకాలకు అనుమతించరని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ రద్దు చేయడం జరుగుతుందన్నారు. ఏర్పాటు చేసిన స్టాల్‌లను డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్లు, హెడ్ ఆఫీస్ నుంచి అధికారుల బృందం వచ్చి ఆకస్మిక తనిఖీలు చేస్తారని కమిషనర్ పేర్కొన్నారు.


Similar News