అఖిలపక్షం సంచలన నిర్ణయం.. బీసీలకు అలర్ట్‌‌ ప్రకటన

కులగణన ప్రక్రియపై బీసీ సంక్షేమ సంఘం నాయకులు కీలక పిలుపునిచ్చారు..

Update: 2024-10-20 15:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న కులగణన ప్రక్రియను స్వాగతించిన బీసీ సంక్షేమ సంఘం దాన్ని విజయవంతం చేయడానికి సంపూర్ణ సహకారం అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఉద్యమ స్ఫూర్తితో కులగణన సక్సెస్ కావాలని వ్యాఖ్యానించిన ఆ సంఘం నేత జాజుల శ్రీనివాసగౌడ్... తెలంగాణ స్ఫూర్తితే దేశవ్యాప్తంగానూ అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన కోసం జారీ చేసిన జీవోపై హర్షం వ్యక్తం చేసిన ఆయన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి వివిధ పార్టీల అభిప్రాయాలను సేకరించారు. కులగణన ప్రక్రియ సజావుగా జరిగేందుకు, ఆశించిన ఫలితాలను సాధించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా భాగస్వామ్యం కల్పించాలని ఈ సమావేశంలో బీసీ సంఘం తీర్మానం చేసింది. అన్ని పార్టీల ప్రతినిధులు కులగణనకు మద్దతు అందించారని, ఇంటింటి సర్వే సందర్భంగా బీసీ ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండి వివరాలను పరిశీలించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకారం అందించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని ఒత్తిడి తీసుకురావడంలో సక్సెస్ అయ్యామన్న శ్రీనివాసగౌడ్... జీవో జారీ చేయడం అందుకు నిదర్శనమన్నారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఆరు నెలలుగా పోరాటం చేస్తున్నామని, అదే స్ఫూర్తితో కులగణన విజయవంతం కావడానికి కూడా కృషి చేస్తామన్నారు. కులగణన ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీలు బాసటగా నిలబడతామంటూ అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఆ పార్టీల ప్రతినిధులు హామీ ఇచ్చారని శ్రీనివాసగౌడ్ పేర్కొన్నారు. కులగణన విజయవంతం కావడానికి ప్రజల్లో విసృత ప్రచారం చేయాలని, అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా రాజకీయ పార్టీల నేతలూ ఇందులో భాగస్వామ్యం కాగలిగితే కులగణన విజయవంతమవుతుందన్నారు. అన్ని పార్టీలూ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాలు నిర్వహించుకుని భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కులగణన కోసం బీసీలు, అఖిలపక్ష పార్టీలు ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ ప్రతినిధులు సిరికొండ మధుసూదనాచారి, బండ ప్రకాష్, శ్రీనివాస్ గౌడ్ సమగ్ర కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోకు మద్దతు పలికి క్షేత్రస్థాయిలో సర్వేకు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. ఎలాంటి జాప్యం లేకుండా బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలన్నారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు వారు ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, బీసీ కులాల లెక్కలు సంపూర్ణంగా తేలడానికి కులగణన ద్వారా సాధ్యమవుతుందన్నారు. ప్రధాని మోడీని తరచూ బీసీ నేత అని బీజేపీ నాయకులు చెప్తూ ఉంటారని, దానికి తగినట్లుగానే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత హనుమంతరావు మాట్లాడుతూ, కులగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 150 కోట్లను విడుదల చేసిందని, ప్రణాళిక శాఖ ద్వారా ప్రక్రియ చేపట్టేందుకు కసరత్తు మొదలుపెట్టిందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచడానికి ప్రభుత్వం, బీసీ కమిషన్ అన్ని చర్యలూ తీసుకుంటాయన్నారు.

కులగణన జరిగే 60 రోజులపాటు బీసీలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే ఎండగట్టాలని వీహెచ్ కోరారు. కులగణన ద్వారా బీసీ వర్గాలకే కాకుండా ఎస్సీ, ఎస్టీ, అగ్రకుల పేదల జనాభా లెక్కలు కూడా తేలుతాయన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న బీసీలు రాజకీయ అధికారం సాధించుకోవడానికి కులగణనను ఏకైక పరిష్కార మార్గంగా భావించాలని, బీసీ కులాలవారంతా తప్పనిసరిగా పేరు నమోదు చేయించుకుని బీసీల ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, జేఏసీ కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, వెంకన్న, పాండు కురుమ, బాల మల్లేష్, శేఖర్, దుర్గాగౌడ్, చంద్రశేఖర్ గౌడ్, గొడుగు మహేష్ యాదవ్, తారకేశ్వరి, సంధ్య, జాజుల లింగం, గూడూరు భాస్కర్, సుంకరి సత్తయ్య గౌడ్, తన్నీరు రాంప్రభు తదితరులు పాల్గొన్నారు.


Similar News